Thursday, November 14, 2024

ఎపి హైకోర్టులో బాబుకు నిరాశ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి హైకోర్టులో బాబుకు నిరాశే ఎదురైంది. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 17వ తేదీకి ఎపి హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై సిఐడి తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఎపి హైకోర్టు విచారణను వాయిదా వేసింది.ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఎపి హైకోర్టు ఆదేశించింది. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ ఏడాది సెప్టెంబర్ 14న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఎసిబి కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఎపి హైకోర్టులో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎసిబి కోర్టు కొట్టివేసిన విషయాన్ని సిఐడి తరపు న్యాయవాదులు హైకోర్టులో ప్రస్తావించారు. అయితే ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్, బెయిల్ పొందిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ 32 రోజులు దాటిన విషయాన్ని కూడ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయమై తమకు సమయం కావాలని సిఐడి తరపు న్యాయవాదులు ఎపి హైకోర్టును కోరారు. దీంతో కౌంటర్‌ను ఈ నెల 17వ తేదీ లోపుగా దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న ఈ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని ఎపి హైకోర్టు వెల్లడించింది.

ఎపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారంట్‌కు ఆమోదం..
చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలన్న జడ్జి…
ఎపి ఫైబర్ నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పిటి వారంట్ కు విజయవాడ ఎసిబి కోర్టు గురువారం ఆమోదించింది. ఈ నెల 16న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరు పర్చాలని జడ్జి ఆదేశించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు కోర్టు ముందు చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఎసిబి కోర్టు ఆదేశించింది. శుక్రవారం చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పులు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఎసిబి కోర్టు సూచించింది.ఎపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్‌లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఫైనల్‌గా మీ వాదనలు వినిపించాలని న్యాయవాదులకు జడ్జి సూచించారు. చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు విన్పించగా,

సిఐడి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదించారు. గురువారం వాదనలు పూర్తి చేస్తే నిర్ణయం చెబుతానన్న న్యాయమూర్తి ప్రకటించారు. సుప్రీంకోర్టు లో శుక్రవారం క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. దీంతో తీర్పును శుక్రవారానికి వాయిదా వేయాలని ఎసిబి కోర్టు జడ్జిని చంద్రబాబు లాయర్లు కోరారు. అయితే ఈ విషయమై సిఐడి న్యాయవాదులు వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని నిర్ణయం చెబుతామని జడ్జి అన్నారు. కోర్టును పది నిమిషాలు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఫైబర్ నెట్ కేసులో తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత చంద్రబాబు తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు విన్పించగా, సిఐడి తరుపున న్యాయవాది వివేకానంద వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఎపి ఫైబర్ గ్రిడ్ కేసులో పిటి వారంట్ కు ఎసిబి కోర్టు అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.

అంగళ్లు కేసు..చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఎపి హైకోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడించనున్నట్టుగా పేర్కొంది. అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు అంగళ్లు, ఎపి ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అయితే ఈ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లకు ఎపి హైకోర్టు సోమవారం తిరస్కరించింది. అంగళ్లు కేసులో డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు వెల్లడించింది. దీంతో చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అంగళ్లు కేసులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా కేసు దర్యాప్తునకు తన క్లయింట్ సహకరిస్తానని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలోనే అంగళ్లు కేసులో అక్టోబరు 12 వరకు అరెస్టు చేయవద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. తాజాగా గురువారం తదుపరి విచారణ జరగగా ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News