మన తెలంగాణ/హైదరాబాద్ : మునిసిపాలిటీలలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణ బిల్లును ఆమోదించడం కుదరదని, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధమవుతుందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన రిజర్వేషన్ల విధానం ఉండాలని, రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన గవర్నరే ఇలాంటి బిల్లును ఆమోదించడం సబబు కాదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన రిజర్వేషన్ల విధానం ఉండాలని ఆ విధంగా పార్లమెంటు 74వ రాజ్యాంగ సవరణ చేసిందని గుర్తు చేశారు. మునిసిపాలిటీల రాజ్యాంగం, మునిసిపాలిటీల కూర్పు, సీట్ల రిజర్వేషన్లను వివరించే ఆర్టికల్స్ 243పి, 243జిలతో కూడిన పేరా 9ఎ ప్రకారం మైనారిటీలకు రిజర్వేషన్ లేదని, ఆర్టికల్ 243ఆర్ మున్సిపాలిటీలో సీట్లు ఎన్నికల ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుందని గవర్నర్ తన అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపర్చినట్లు సమాచారం.
రాజ్యాంగంలోని మొత్తం 9ఎ విభాగంలో మైనారిటీల ప్రస్తావన లేనే లేదని గవర్నర్ తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు 2022లో పేర్కొన్న ప్రతిపాదిత అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 9ఎ ని స్పష్టంగా ఉల్లంఘిస్తోందని గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారని తెలిసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే దానిని ఓడించే పార్టీ కాలేరని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం మైనారిటీ ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రవేశపెట్టే బిల్లును ఆమోదించడం కుదరదని, అందుచేత ఈ బిల్లును తిరిగి పంపిస్తున్నట్లుగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
మెడికల్ బిల్లుపై క్లారిటీ కోరిన గవర్నర్
మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పదవీ విరమణ చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. వైద్య విద్య విభాగంలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇతరుల పదవీ విరమణ వయసును 61 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని చట్ట సవరణ బిల్లుకు పలు ప్రశ్నలను సంధిస్తూ గవర్నర్ వెనక్కి పంపినట్లు తెలిసింది. పదవీ విరమణ వయసు పెంచితే ఎంతమంది లబ్ధి పొందుతారు? ఖజానాపైన ఆర్థికభారం ఎలా ఉంటుంది? అనే అంశాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఈ ప్రశ్నలకు దయచేసి వివరణ ఇవ్వాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన లేఖలో కోరినట్లు తెలిసింది.