హైకోర్టుకు వెల్లడించిన కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు : పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని, కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలియజేసింది. యుడుపి జిల్లా ముస్లిం బాలికల తరఫున దాఖలైన పిటిషన్‌పై ఎనిమిదో రోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవడ్గి వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ క్రిష్ణ ఎం దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. తరగతి గది లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగం లోని అధికరణం 19 ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ఉందని, అయితే ఈ హక్కుపై అధికరణం 19 (2) ప్రకారం ఆంక్షలు విధించవచ్చని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవడ్గి తెలిపారు. ప్రస్తుత కేసులో విద్యాసంస్థల లోపల సమంజసమైన ఆంక్షలను రూల్ 11 విధిస్తోంది తప్ప అధికరణ 25 ప్రకారం కాదని వాదించారు.ఇది సంస్థాగత క్రమశిక్షణకు లోబడి ఉన్నట్టు తెలిపారు.
ప్రస్తుత కేసులో వ్యవస్థాపరమైన ఆంక్షలు విద్యాసంస్థల లోపల తప్ప మరెక్కడా కాదని వివరించారు. ఈ కేసులో సంక్లిష్టతను వివరిస్తూ ఒకవేళ హిజాబ్‌కు మతపరమైన అనుమతిని ఇస్తే వెనువెంటనే ఆ మతాన్ని ఆచరించే మహిళలు హిజాబ్ ధరించాలనే నిర్బంధానికి గురవుతారన్నారు. నచ్చినదాన్ని ధరించడానికి అవకాశం ఉండదన్నారు. స్వేచ్ఛ దూరమౌతుందన్నారు. నిర్బంధం విధించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధమని చెప్పారు. దీన్ని తప్పనిసరి చేయకూడదన్నారు. సంబంధిత మహిళల ఇష్టానికి వదిలిపెట్టాలన్నారు. మతం ఆధారంగా ఎటువంటి వివక్ష ఉండకూడదని, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మైనారిటీ సంస్థల విషయానికొస్తే వాటిలో యూనిఫాం కోడ్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని, నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఆయా సంస్థలకే వదిలిపెడుతోందని వివరించారు.
హిజాబ్ ధరిస్తూ తరగతులకు హాజరు కావడాన్ని కాలేజీ అధికార యంత్రాంగం ఒప్పుకోకపోవడంతో జనవరి 1న యుడుపి కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థినులు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌ఐ) నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఈ వివాదాన్ని ప్రస్తావించారు. హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కాడానికి అనుమతి ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ను కోరిన తరువాత నాలుగు రోజులకు పాత్రికేయ సమావేశం జరిగింది. అప్పటివరకు విద్యార్థులు క్యాంపస్‌లో హిజాబ్ ధరించేవారని, తరగతులకు వెళ్లే ముందు హిజాబ్ తొలగించేవారని, కాలేజీ ప్రిన్సిపాల్ రుద్రగౌడ చెప్పారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించక పోవడం గత 35 ఏళ్లుగా జరుగుతూనే ఉందన్నారు. అయితే బయటిశక్తుల ప్రోద్బలంతో ఇప్పుడు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని ప్రస్తావించారు.