Friday, November 15, 2024

అమెరికాలో బియ్యమో రామచంద్ర

- Advertisement -
- Advertisement -

ఆహార భద్రత సాకుతో బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం
తెలంగాణ వడ్లు కొనకుండా కక్ష సాధింపు చర్యలు
అమెరికా మాల్స్‌లో బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు
గంటల వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులు దర్శనం, భారీగా ధరల పెంపు
పేరుకుపోయిన వస్తు నిల్వలను వదిలించుకునేందుకు బియ్యం కొనుగోళ్లతో లంకె

మన  తెలంగాణ: అమ్మ పెట్టదు.. అన్న చందంగా బియ్యం ఉత్పత్తి చేస్తున్న రైతుల పాలిట కేంద్ర ప్రభుత్వ విధానాలు దయ్యంలా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాస్మతేతర, సోనా రకాల బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో రైతులు, రైతు సంఘాలు ప్రధాని మోడీ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు. అసలే వ్య వసాయరంగంలో విత్తనం మొదలుకు పురుగు మందులు, రసాయనిక ఎరువులు, కూలీ ఖర్చులు పెరిగిపోయాయి. వ్యవసాయ యాంత్రీకరణకు ఉపయోగించే డీజిల్ ధరలపై రాయితీలు ఎత్తివేసిన కేంద్రం జిఎస్‌టిని ముక్కుపిండి వ సూలు చేస్తోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు వరి సాగు రై తులకు ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదు. వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పంటలు పండిస్తున్న రైతుల పట్ల మోబా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు రైతుల మదిలో గూడు కట్టుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా బియ్యం ఎగుమతుల పట్ల విధించిన నిషేధం ప్రధాని వైఖరి పట్ల రైతుల్లో ఉ న్న అభిప్రాయాలకు మరింత బలం చేకూర్చుతోందంటున్నారు. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయి ఆహార ధాన్యాల కొరతతో ధరలు పెరిగితే వినియోగదారులకు భారం కాకుండా రాయితీలు కల్పించి ఆహారధాన్యాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభుత్వం

ఏకంగా ధాన్యం పండించే రైతుల పీక నొక్కేలా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశ ధాన్యాగారంగా పేరుపొందిన తెలంగాణ వరి రైతులను దెబ్బతీసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. గత ఏడాది బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఎఫ్‌సిఐ నిరాకరించింది. ఇప్పటికే బియ్యం నిల్వలు కేంద్ర గోదాముల్లో మూడేళ్లకు సరిపడా మూలుగుతున్నాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రమంత్రుల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు బియ్యం కొనుగోలుకు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి అదనంగా ఒక్క గింజ కూడా కొనుగోలు చేసేది లేదని భీష్మించింది. నూకల బియ్యం తినమని ఉచిత సలహా ఇచ్చింది. తీరా ఇప్పుడు వర్షాలు లేక, వరిసాగు విస్తీర్ణం తగ్గటంతో నరేంద్రమోడీ ప్రభుత్వానికి దేశ ప్రజల ఆహార భద్రత గుర్తుకు వచ్చింది. తాజాగా కేంద్రం అమలులోకి తెచ్చి బియ్యం ఎగుమతుల నిషేధంతో తెలంగాణ రైతుపై తీవ్ర ప్రభావం పడనుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఉడుకుతున్న బియ్యం!

కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధపు ఉత్తర్వులు క్షణాల్లో పాశ్చాత్య దేశాలకు పాకిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ధరలు శనివారం నుంచే కుతకుతలాడుతున్నాయి. అమెరికాలో బి య్యం ఆహారంగా తీసుకునే ప్రజల్లో ఆందోళన సెగలు మా ల్స్‌కు తాకాయి. ఇండియా నుంచి బ్యియం ఎగుమతులు ఆగిపోతే ఇక ఇక్కడి మార్కెట్లలో కొరత ఏర్పడి ధరలు మ రింత పెరిగిపోతాయన్న ఆదుర్ధా వినియోగదారులను మా ల్స్‌లో బియ్యం ప్యాకేట్ల కోసం ఎగబడేలా చేస్తోంది. అమెరికాలోని బియ్యం విక్రేతలు కూడా జాగ్రత్తపడుతున్నారు. జనం నుంచి వస్తున్న డిమాండ్లను చూసి సందట్లో సడేమియా అన్నట్టు ధరలు అమాంతం పెంచి వేశారు. కిలో బియ్యం మన కరెన్సీలో రూ.160నుంచి రూ.200కు విక్రయిస్తున్నారు. మాల్స్‌లో సోనా మసూరి బియ్యం గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి. కొన్ని చోట్ల రైస్ నో స్టాక్ బోర్డులు వేళాడేశారు. మరికొన్ని చోట్ల అంతగా అమ్ముడుపోకుండా పేరుకుపోతున్న ఇతర వస్తువుల నిల్వలు వదిలించుకునేందుకు బియ్యానికి లంకె పెడుతున్నారు. అవి కొంటేనే బియ్యం విక్రయిస్తామని ఆఫర్లు పెడుతున్నారు.

బియ్యం ఎగుమతుల్లో 40శాతం మనదే !

ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్న బియ్యంలో మనదేశం నుంచే 40శాతం ఎగుమతి అవుతున్నాయి. అమెరికాతోపాటు 140దేశాలకు ఇక్కడి నుంచే బియ్యం ఎగుమతి జరుగుతుంది. దేశంలో 43.86 మిలియన్ హెక్టార్లలో వరిసాగు జరుగుతుండగా, 104.80 మిలియన్ టన్నుల బియ్యం దిగుబడి లభిస్తోంది. అయితే ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ,దేశ వ్యవసాయరంగానికి ప్రాణం పోసే నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం జరగటం , దేశంలో ఉత్తరాదిని అధిక వర్షాలు ,వరదలు, దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులు పంటల సాగువిస్తీర్ణతపై పెను ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకించి వరిసాగుపై ఈ ప్రభావం మరింత అధికంగా పడుతోంది.దేశానికి ధాన్యాగారంగా పేరు పడ్డ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ పలు జిల్లాల్లో వరినార్లు పోసే పరిస్థితి లేకుండా పోయింది.

దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో వరిపండించే రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణలోనూ ఈ సారి వరికి ప్రతికూల వాతావరణం ఇంకా తొలగిపోనేలేదు. ఖరీఫ్‌లో 50లక్షల ఎకరాల్లో వరి సాగు సాధారణ విస్తీర్ణతను ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సమయానికి 9లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సివుంది. ఇప్పటివరకూ 8లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. సాగు విస్తీర్ణత సాధారణ స్థాయికి చేరుకోకపోతే ఈ ప్రభావం ఉత్పత్తి లక్ష్యాలను దెబ్బతీస్తుంది. రబీ సీజన్‌లో కోటి 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయింది. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వరి రైతుల నుంచి 66.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అందులో కామన్ రకం 18.89లక్షల టన్నులు కాగా, ఏ గ్రేడ్ రకం 47.81లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఈ సారి వరి సాగు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా 12శాతం తగ్గే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ వర్గాలు అంచనా వేశాయి. ప్రతికూల వాతవారణం నేపధ్యంలో సాగు అంచనాలు మరింత తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదంటన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News