Wednesday, January 22, 2025

రాష్ట్రంలో యూరియా కొరత లేదు: నిరంజన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాల పంటలకు సంబంధించి ఎలాంటి యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. యూరియా కొరత ఉన్నట్టు వస్తున్న ఆరోపణల నేపధ్యంలో మంత్రి శనివారం సచివాలయంలో యూరియా నిల్వలపైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ వానాకాలం సీజన్ కు 9.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు. మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ముందస్తు నిల్వ ఉందని, మొత్తం ఈ సీజన్ లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్ టన్నులు అని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎరువుల కొరత లేదన్నారు. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 16,615 అధీకృత డీలర్ల ద్వారా యూరియా సరఫరా జరుగుతున్నదని తెలిపారు.మొత్తం రాష్ట్రంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో యూరియా లేదంటూ దుష్ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు.

ఇది అవగాహనా రాహిత్యమే కాదు.. దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం అని అన్నారు. సంబంధిత సహకార సంఘాల మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఉద్దేశపూర్వకంగా తప్పుచేసిన ఎవరినీ ఉపేక్షించం అని హెచ్చరించారు. శుక్రవారం నాడు రాష్ట్రంలో 15,838 మెట్రిక్ టన్నుల యూరియా ఖరీదు చేయడం జరిగిందని తెలిపారు. సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, సంయుక్త సంచాలకులు (ఎరువులు) రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News