గవర్నర్ కోటా ఎంఎల్ సి అభ్యర్థిత్వాల తిరస్కరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎంఎల్‌సిల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఈ పరిణామం మరోసారి రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యా ప్ అంశంపై చర్చకు కారణమైంది. నామినేటెడ్ కోటా ఎంఎల్‌సిలుగా కు ర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను కేబినెట్ సిఫార్సు చేసి న సంగతి విదితమే. కేబినెట్ సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సర్వీస్ సెక్టార్‌లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.
సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఈ ఇద్దరికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని, ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవన్నారు. నామినేటెడ్ కో టాకు తగిన అర్హతలు లేని అభ్యర్థులను నామినేట్ చేయడం తగదన్నారు. తగిన అర్హతలు ఉన్న ఎంతోమంది ప్రముఖులు రా ష్ట్రంలో ఉన్నారన్నారు. అర్హుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేయడం సరైంది కాదన్నారు. ఇలా చేయడంతో ఆయా రంగాల్లో పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించనట్లేనన్నారు. నామినేటెడ్ కోటాలో ఎంఎల్‌సిలుగా ఎవరిని ఎంపిక చేయాలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. మంత్రి మండలి సిఫారులో ఈ విషయాలను స్పష్టం చేయలేదని గవర్నర్ వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు తిరస్కరించాలని గవర్నర్ సిఎం, మంత్రి వర్గానికి సూచించారు.
గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా ఎంఎల్‌సి పదవికి రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిఫార్సును కూడా అప్పట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించిన సంగతి విదితమే. ఈ వ్యవహారం అప్పట్లో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మధ్య మరింత దూరం పెంచింది. అయితే గత మాసంలో తన మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డిని సిఎం కెసిఆర్ తీసుకున్నారు. అయితే పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత గవర్నర్‌తో కెసిఆర్ 10 నిమిషాలు మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయం లో మసీదు, చర్చి, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవంలో కెసిఆర్‌తో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గవర్నర్‌కు కెసిఆర్ దగ్గరుండి సచివాలయాన్ని చూపించారు. ఈ ఘటనతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం తగ్గిందని అంతా భావించారు. గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ఓ పుస్తకాన్ని గవర్నర్ ఇటీవల విడుదల చేశారు. నాలుగేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్ ప్రస్తావించారు. అంతేకాదు కెసిఆర్ నుండి తాను కొన్ని విషయాలను నేర్చుకున్నట్టుగా ఆమె తెలిపారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సి పదవులకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర కేబినెట్ పంపింది. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కో టా కింద ఎంఎల్‌సిగా నామినేట్ చేయలేమని గవర్నర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. ఈ లేఖ పంపడంపై బిఆర్‌ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి.
దాసోజు శ్రవణ్ అసంతృప్తి
గవర్నర్ తమిళిసై సౌందరాజన్ నిర్ణయంపై బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ కోటాలో మంత్రి వర్గం సి ఫార్సు చేసిన అభ్యర్థులను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక సేవ రాజకీయాలు విభిన్నమైన పాత్ర లు, ప్రయోజనాలను కలిగి ఉంటాయన్నారు. కానీ అవి రెండూ ఒకటేనన్నారు. రాజకీయ నాయకులు చట్టం ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడానికి పని చేయవచ్చన్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించేటప్పుడు సామాజిక మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రెం డు రంగాలు తరుచుగా కలుస్తాయని దాసోజు శ్రవణ్ వెల్లడించారు.