Tuesday, November 5, 2024

నిషేధం లేదు.. కట్టడి ఖచ్చితమే

- Advertisement -
- Advertisement -
No total ban on use of firecrackers
బాణాసంచాపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : దేశంలో దీపావళి సందర్భంగా బాణాసంచా పేల్చడంపై సుప్రీంకోర్టు శుక్రవారం వివరణ ఇచ్చింది. దీనిపై పూర్తి నిషేధం ఏదీ లేదని, అయితే బేరియం సాల్ట్‌తో రూపొందే టపాకులపై నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఇంతకు ముందటి తమ రూలింగ్‌కు వివరణ ఇచ్చుకుంది. కాలుష్యకారక ప్రమాదకర బాణాసంచా వినియోగంపై తాము వెలువరించిన ఆదేశాలకు అంతా నిర్థిష్టంగా కట్టుబడి ఉండాల్సిందేనని న్యాయమూర్తులు ఎంఆర్ షా, ఎఎస్ బొపన్నతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఉత్సవాలు వేడుకల పేరిట ఎవరూ తమ మార్గదర్శకాలను ఉల్లంఘించడానికి వీల్లేదు, ఎటువంటి అధికారిక వ్యవస్థకు కూడా అనుమతిని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇతరుల ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా ఉంటే అవి ఉత్సవాలు అవుతాయా? అని ప్రశ్నించారు. ఆరోగ్య మూల్యంతో చేటును కల్గిస్తే కుదరదని తెలిపారు.

రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలో ఎవరు కూడా ఇతరుల ఆరోగ్య హక్కుకు భంగం వాటిల్ల చేయరాదని నిర్ధేశిత అంశం పొందుపర్చారు. శబ్దాలు, రసాయనిక వాయువుల వ్యాప్తితో పౌరులు ప్రత్యేకించి వృద్ధులు, పిల్లలపై పడే ప్రభావం గురించి ఆలోచించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. అయితే టపాకుల పేల్చడంపై నిషేధం విధించారనే వాదన నిజంకాదని తేల్చిచెప్పారు. ఆరోగ్యానికి చేటు కల్గించే పదార్థాలతో తయారుచేసే వాటిని వాడరాదనేదే కీలక అంశం అని, వీటిపై నిషేధం ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఇటువంటి వాటిపై తాము నిర్ధేశించిన నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుపర్చాల్సిన బాధ్యత రాష్ట్రాలు, అధికారిక సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంది. ఈ దిశలో వాటి నుంచి ఎటువంటి నిర్లక్షం జరిగినా ఇది తమ దృష్టికి వచ్చినా తాము తీవ్రస్థాయిలో స్పందించాల్సి ఉంటుందన్నారు. నిషేధిత బాణాసంచా, వాటి వాడకంపై ఆంక్షల గురించి తాము వెలువరించిన ఆదేశాలను ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ప్రజల వద్దకు విరివిగా తీసుకువెళ్లాలి. ఇందుకు పలు రకాల ప్రసార మాధ్యమాలను వాడుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News