న్యూఢిల్లీ : గంగానదీ జలాల్లో కరోనా వైరస్ జాడలేదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గంగానది తీర ప్రాంతాల్లో కరోనా మృతదేహాలను నదిలోకి విడిచిపెట్టడం, కొన్ని శవాలు నీటిపై తేలియాడి భయాందోళనలు కలిగించడం తెలిసిందే. దీంతో కన్నూజ్, ఉన్నవో, కాన్పూర్, హమీర్‌పూర్, అలహాబాద్, వారణాసి, తదితర ప్రాంతాల నుంచి గంగానదీ జలాల నమూనాలు సేకరించి పరీక్షించగా కరోనా వైరస్ ఆనవాళ్లు లేవని తేలింది. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సిఎస్‌ఐఐఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చి (ఐఐటిఆర్) , లక్నో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, సహకారంతో జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. కరోనా మృతదేహాలను నీటిలో పడేసినా నీటిలో మాత్రం కరోనా వైరస్ జాడలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.