ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదన్న మాట వినబడొద్దు కొత్త గ్రామపంచాయతీలతో
సహా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటి రోడ్డు వేయాల్సిందే ఆర్‌ఆర్‌ఆర్
భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలి రైతులకు మెరుగైన పరిహారం అందేలా చూడాలి పంట
పొలాలకు రైతులు సులువుగా చేరేలా ఎన్‌హెచ్‌ఏఐలో అండర్‌పాసులను నిర్మించాలి ఆర్ అండ్ బి,
అటవీ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి మూడేళ్లలో హ్యామ్ రహదారుల నిర్మాణాలను
పూర్తి చేయాలి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదన్న మాట వినబడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త గ్రామపంచాయతీలతో సహా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బిటి రోడ్డు ఉండాల్సిందేనని, దీనికి సం బంధించి విడతల వారీగా నిధులను విడుదల చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారుల భూ సేకరణ, పరిహారం, హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటి మోడల్) విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స మీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధం గా డిజైన్ చేయాలని సిఎం రేవంత్ ఈ సందర్భంగా సూచించారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహారించాలని ఆయన సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలని సిఎం ఆదేశించారు. భూ సేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించడం ద్వారా భూ సేకరణను వేగవంతం చేయొచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్ (దక్షిణ)కు ఎన్‌హెచ్‌ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున హెచ్‌ఎండిఏతో అలైన్‌మెంట్ చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సిఎం పేర్కొన్నారు. రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎం ఆదేశించారు.
అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోంది?
రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్-విజయవాడ (ఎన్‌హెచ్‌ఏఐ 163జీ) రహదారి, ఆర్మూర్, -జగిత్యాల-, మంచిర్యాల రహదారి (ఎన్‌హెచ్‌ఏఐ -63), జగిత్యాల, -కరీంనగర్ (ఎన్‌హెచ్‌ఏఐ 563) రహదారుల నిర్మాణంతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్డ్‌బ్ల్యూఎఫ్) రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపునకు సిఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పిసిసిఎఫ్) డోబ్రియల్‌ను సిఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఉన్నాయని పిసిసిఎఫ్ బదులిచ్చారు.
రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సిఎం ఆదేశించారు. ఆర్ అండ్ బి, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సిఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారితో పది రోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలని, ఇక్కడ కాకపోతే ఆర్ అండ్ బి, అటవీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులతో సమావేశమై అనుమతులు సాధించాలని సిఎం సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాసుల నిర్మాణాన్ని విస్మరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. రైతులు కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సిఎం సూచించారు.
హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం…
రాష్ట్రంలో హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బి పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులను నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సిఎం సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అనే తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్లను చేపట్టాలని సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి కన్సల్టెన్సీల నియామకం, డిపిఆర్‌ల తయారీ, రహదారుల నిర్మాణం విషయంలో క్రియాశీలకంగా వ్యవహారించాలని అధికారులను సిఎం ఆదేశించారు. మూడేళ్లలో ఈ రహదారుల నిర్మాణం పూర్తికావాలని సిఎం సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెలను వెంటనే నిర్మించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంటనే విడుదల చేసి, కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సిఎం సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, జి.చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శులు షానవాజ్ ఖాసీం, మాణిక్ రాజ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.