రిజర్వాయర్‌లో పూడికతో సుంకేసుల ప్రాజెక్టు వెలవెల
ఏపిలో కేసికాలువకు తగ్గిన ప్రవాహ సామర్ధం
తెలంగాణలో తుమ్మిళ్మకు నీటిలభ్యత కష్టమే
కరకట్టలు సిధిలమై వరదల భయంలో గ్రామాలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు వందలాది గ్రామాలకు తుంగభద్ర జలాలను అందజేసే సుంకేసుల ప్రాజెక్టు పూడిక మట్టి పేరుకుపోయి సామర్ధం మేరకు నీటినిలువ చేసే పరిస్థితి లేక వెలవెలబోతోంది. దేశంలో మరేనదిపైనా ప్రాజెక్టులు ఆనకట్టలు లేని రోజుల్లోనే అప్పటి బ్రీటీష్ పాలకులు తుంగభధ్ర నదిపై నిర్మించిన ఈ ఆనకట్టు చారిత్రిక అనవాళ్లకు సజీవ సాక్షంగా కొనసాగుతోంది. కృష్ణానదిపై అలమట్టి మొదలుకుని ప్రకాశం బ్యారేజి దాక శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణాలేవీ లేనిరోజుల్లోనే సుంకేసుల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిపైన ఇటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా రాజోలి గ్రామం, అటు ఏపిలోని కర్నూలు జిల్లా సుంకేసుల గ్రామాల మధ్య 1858లో ఆనకట్ట పనులు ప్రారంభించి 1861లో ప్రాజెక్టును బిటీష్ పాలకులు ప్రారంభించారు. ఈ ఆనకట్ట నుంచి కర్నూలు జిల్లా మీదుగా కడప పరకూ 306కిలోమీటర్ల నిడివిన కాలువ తవ్వారు. తొలుత బిటీష్ ప్రభుత్వ అవసరాల రిత్యా నౌకాయానం కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాత ప్రధాన సాగు, తాగు నీటి వనరుగా మారింది. తొలుతు ఏపిలోని కర్నూలు, కడప జిల్లాలకు మాత్రమే పూర్తిగా ఉపయోగపడుతూ వచ్చిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా సాగునీటిని అందజేస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ సుంకేసుల రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఆధారంగా చేసుకుని ఆనకట్టకు ఎగువన తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.2017లో సర్వే పూర్తి చేయించి డిపిఆర్ సిద్దం చేయించారు.
2018లో పనులు ప్రారంభించి అదే ఏడాది నవంబర్ 14న తుమ్మిళ్మ ఎత్తిపోతల పథకం కలను సాకారం చేశారు. రాజోలిబండ మళ్లింపు పధకం ఆయకట్టులో 55000 ఎకరాలకు సాగునీరందిచాలన్నది లక్షంగా ఎంచుకున్నారు. ఈ లక్షంగా భాగంగా సుంకేసుల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 5టిఎంసీల తుంగభద్ర జలాలను ఆర్డీఎస్ కాలువలోకి ఎత్తిపోసేందుకు 5.5మెగావాట్ల సామర్ధంతో భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. మొత్తం మూడు మోటారల ద్వారా 70రోజుల్లో 5 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను పూర్తి చేయించారు. ఇక అప్పటినుంచి సుంకేసుల రిజర్వాయర్ ఇటు తెలంగాణకు అటు ఏపికి ఉమ్మడి ప్రాజెక్టుగా సేవలందిస్తోంది.
తుంగభద్ర వరదలతో కంటిమీద కునుకు కరువు:
సుంకేసుల జలాశయం పూడిక పడి ఎగువ నుంచి వచ్చే తుంగభద్ర వరదనీరు ఆనకట్టకు ఇరువైపులా ఉన్న గ్రామాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2009లో తుంగభద్ర నదికి వచ్చిన భారీ వరదలు వచ్చాయి. సుంకేసుల ఆనకట్టకు ఇరువైపులా ఉన్న గ్రామాలను వరదనీటితో ముంచెత్తిన దృశ్యాలు తుంగభద్ర నదీసమీప గ్రామాల ప్రజలకు ఇంకా కళ్లముదు లీలగా కదులుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఇటు తెలంగాణలో రాజోలి, అటు ఏపిలో సుంకేసుల గ్రామాలు ఆ నాటి వరదల్లో భారీగా నష్టపోయాయి. ప్రళయంలా ముంచెత్తిన వరదలు అనకట్టకు ఇరుపైపులా గ్రామాలకు రక్షణగా ఉన్న కరకట్టలను చిన్నాభిన్నం చేశాయి. ప్రధాన ఆనకట్టసైతం దెబ్బతింది. ఆనకట్టకు ఉన్న 30గేట్లు వరదనీటిని షెట్టర్లు కంపించి పోయాయి. భారీ వరదుల సృష్టించిన భీభత్సం దృశ్యాలకు సాక్ష్యాలు ఇంకా అలాగే ఉన్నాయి
రూ.783తో ఆధునీకరణ ప్రతిపాదిన:
సుంకేసుల ఆనకట్ట ఆధునీకరణ పనులు చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఏపి ప్రభుత్వం రూ.783కోట్ల ప్రాధమిక వ్యయపు అంచనాలతో నివేదిక రూపొందించింది. నదీపరివాహక గ్రామాల ప్రజలు, రైతుల వత్తిడి మేరకు తాత్కాలిక ప్రాతిపదికన 61కోట్లతో రిపేర్లు చేసింది. ఆ తర్వాత రూ.783కోట్లతో రూపోందించిన ఆధునీకరణ ప్రతిపాదన నివేదికను పూర్తిగా అటకెక్కించింది. ఇటు రిజర్వాయర్‌లో పేరుకుపోయిన పూడిక తీసే పరిస్థితి లేక, అటు సామర్దం మేరకు రిజర్వాయర్‌లో నీటిని నిలువ చేసే అవకాశం లేక, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరివాహక గ్రామాల కరకట్టలు బలహీన పడిపోయి, పలుచోట్ల గండ్లు పడి గ్రామాలు వరదభయంతో బిక్కుబిక్కుమంటున్నాయి.
No water in Sunkesula Reservoir