హైదరాబాద్: మంచినీటి పైపులైను మరమత్తుల కారణంగా ఈ నెల 11వ తేదీన నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2కు సంబంధించి పటాన్‌చెరువు నుంచి హైదర్‌గూడ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపునకు సంబంధించి లీకులు నివారిచేందుకు ఆర్‌సిపి పురంలోని లక్ష్మీగార్డెన్ , మదీనాగూడలోని సుమాన్ కాలేజ్ ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరమ్మత్తుల కారణంగా ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు అంటే మొత్తం 24 గంటల పాటు మరమ్మత్తులు జరుగుతాయని దీంతో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలు ఇవే…
మంచి నీటిపైపు లైను కారణంగా బీరంగూడ, అమీన్‌పూర్, ఆర్‌సిపురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్ , కేపిహెచ్‌బి కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనర్ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట,బాచుపల్లి,బొల్లారం, హైదర్‌నగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో 24 నీటి సరఫరా ఉండదన్నారు.అదే విధంగా ఎర్రగడ్డ, బంజారాహిల్ రిజర్వాయర్ పరిధిలో పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు లో ప్రషర్‌తో నీటి సరఫరా జరుగుతుందన్నారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొవాలని, వారికి కలిగే అంతరాయానికి తాము చింతిస్తున్నామని తెలిపారు.