న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మొదటి రెండు రోజులు పార్లమెంటు ఉభయ సభల్లో శూన్య కాలం (జీరో అవర్), ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉండదని శనివారం పార్లమెంటరీ బులెటిన్ పేర్కొంది. జనవరి 31న సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి.
పార్లమెంటు సమావేశాల రెండో రోజున కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘జనవరి 31న సమావేశమయ్యే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం వల్ల ఆ రెండు రోజులు ‘జీరో అవర్’ ఉండదని పార్లమెంటరీ బులెటిన్ పేర్కొంది. జీరో అవర్‌లో లేవనెత్తాలనుకుంటున్న ప్రజా ప్రాముఖ్యత అంశాలను ఫిబ్రవరి 2న చేపట్టనున్నట్లు కూడా ఆ బులెటిన్ పేర్కొంది. ఫిబ్రవరి 2 నుంచి ఉభయ సభలు ‘రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం’పై చర్చను నిర్వహిస్తాయి. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ సమాధానాలిస్తారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఈ భాగం ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నది. ఇక బడ్జెట్ సమావేశానికి సంబంధించిన రెండో భాగం విరామం తర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నది. ఈ సమయంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై, ఆమోదించిన కేంద్ర బడ్జెట్‌పై చర్చలు జరుగనున్నాయి. ఇదే కాలంలో ఇతర శాసనాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగనున్నది.