Thursday, January 16, 2025

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

- Advertisement -
- Advertisement -

స్టాక్‌హోం: భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జె హోప్‌ఫీల్డ్, జెఫ్‌రీ ఈ హింటన్‌లు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణల అభివృద్ధికి గాను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. భౌతిక శాస్త్రంలోని ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ టెక్నిక్‌లు సృష్టించినట్టు నోబెల్ కమిటీ వివరించింది. సమాచారం స్టోర్ చేసి, రీకన్‌స్ట్రక్ట్ చేసే విధానాన్ని జాన్ హోప్‌ఫీల్డ్ సృష్టించినట్టు కమిటీ పేర్కొంది. డేటాలో ఉన్న వివిధ ప్రాపర్టీల గురించి జెఫ్రీ హింటన్ ఓ విధానాన్ని డెవలప్ చేశారు. ఆ విధానం ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌ను అమలు చేయవచ్చునని కమిటీ తెలియజేసింది.

జాన్‌హోప్‌ఫీల్డ్

జాన్‌హోప్ ఫీల్డ్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. అసోసియేటివ్ న్యూట్రల్ నెట్‌వర్క్‌పై సాగించిన అధ్యయనంతో హోప్‌ఫీల్డ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తగా 1982లో విశేష ఖ్యాతి గడించారు. అమెరికా లోని చికాగోలో ఇల్లినోయిస్‌లో జన్మించిన జాన్‌హోప్‌ఫీల్డ్ 1954లో స్వార్త్‌మోర్ కాలేజీలోను, 1958లో కార్నెల్ యూనివర్శిటీలోనూ విద్యాభ్యాసం చేశారు. తండ్రి జాన్ జె. హోప్‌ఫీల్డ్. ఆల్‌బెర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ సాధించారు. ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ అనుబంధ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

జెఫరీ ఈ హింటన్

బ్రిటిష్ కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టు, కాగ్నిటివ్ సైకాలజిస్టు, అయిన జెఫరీ ఈ హింటన్ “గాడ్‌ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ నెట్‌వర్క్‌”గా ప్రఖ్యాతి గడించారు. 1947 డిసెంబర్ 6న బ్రిటన్ లోని లండన్‌లో వింబుల్డన్‌లో జన్మించారు. ఆయన వయసు 76 ఏళ్లు. 1967 నుంచి 1970 వరకు కేంబ్రిడ్జి లోని స్కూల్ ఆఫ్ ఇన్‌ఫర్మేటిక్స్‌లోను, 19721975 వరకు యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లో విద్యాభ్యాసం చేశారు. లెర్నింగ్ రెప్రెజెంటేషన్స్ బై బాక్‌ప్రోపగేటింగ్ ఎర్రర్స్ అనే గ్రంథ రచన చేశారు. ట్యూరింగ్ అవార్డును సాధించారు. తల్లిదండ్రులు మార్గరెట్ క్లార్క్, హెచ్ ఇ హింటన్. బ్రిటిష్ కెనడియన్ జాతీయుడు.

గత ఏడాది ముగ్గురికి లభించిన నోబెల్

గత ఏడాది (2023) భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారం ముగ్గురికి లభించింది. పరమాణువు లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతి వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్ స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్‌లు ఆ పురస్కారం అందుకున్నారు. మొత్తంగా 1901 నుంచి ఇప్పటివరకు 117 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా, మంగళవారం భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం రసాయన శాస్త్రం , గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి , అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News