నాప్యిడా (మయన్మార్): మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్‌సాన్ సూకీ (77)కి అక్కడి కోర్టు సోమవారం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్టు కోర్టు పేర్కొంది. మయన్మార్‌లో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించడానికి ఆమె నెలకొల్పిన ‘డా ఖిన్ క్వీ’ ఫౌండేషన్ నిధులను సూకీ దుర్వినియోగం చేశారంటై కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమిని రాయితీ ధరకు లీజుకు తీసుకున్నట్టు న్యాయస్థానం తేల్చి శిక్షను ఖరారు చేసింది. మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత సూకీని గత ఏడాది ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. అవినీతి కేసులతోపాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వరకు మొత్తం 18 నేరాలపై ఆమెను దోషిగా కోర్టు పేర్కొంది. ఈ నేరారోపణలన్నీ అసంబధ్ధమైనవిగా సూకీ కొట్టిపారేశారు. న్యాపిడాలోని జైలులో ఒంటరిగా ఆమె నిర్బంధంలో ఉంటున్నారు. ఇతర కేసుల్లో ఇప్పటికే ఆమెకు 11 ఏళ్లు శిక్ష పడింది. మిగిలిన కేసుల్లోనూ దోషిగా తేలితే దాదాపు 190 ఏళ్ల పాటు ఆమె జైలులో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
Nobel laureate Aung San Suu Kyi gets 6 years to jail