ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మొహమ్మద్ యూనుస్‌కు కార్మిక చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణపై దిగువ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. అయితే ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన చర్యగా ఆయన మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. కార్మిక చట్టాలను 83 ఏళ్ల యూనుస్ ఉల్లంఘించారన్న ఆరోపణలు నిరూపితమయ్యాయని, ఆరు నెలల సాధారణ లేదా కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మెరీనా సుల్తానా ప్రకటించారు.
గ్రామీణ్ టెలికం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న యూనుస్‌తోపాటు మరో ముగ్గురు అధికారులకు న్యాయస్థానం ఆరు నెలల కారాగార శిక్షతోపాటు 25 వేల టాకాల(బంగ్లాదేశ్ కరెన్సీ) చొప్పున జరిమానా విధించింది. తీర్పు వెలువడిన సమయంలో కోర్టులోనే ఉన్న యూనుస్, మరో ముగ్గురు అధికారులు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేశారు. నెల రోజుల బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతించింది. గ్రామీణ్ టెలికం అనే సామాజిక వాణిజ్య కంపెనీని స్థాపించడం ద్వారా పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంలో యూనుస్ పముఖ పాత్ర పోషించారు.
మైక్రోఫైనాన్స్‌లో బంగ్లాదేశ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కల్పించారు. తన కంపెనీలో కార్మికల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనందుకు ఆయనపై కార్మిక చట్టాల ఉల్లంఘన కేసు నమోదైంది. గ్రామీణ బ్యాంకు ద్వారా పేదరికి నిర్మూలన ప్రచారాన్ని చేపట్టిన యూనుస్‌కు 2006లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే ప్రధాని షేక్ హసీనాతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. 2008లో ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత యూనుస్‌పై వరుసగా దర్యాప్తులకు ఆమె ఆదేశించారు.