Saturday, November 23, 2024

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Nobel peace prize laureate desmond tutu no more

జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన మానవ హక్కుల కార్యకర్త , నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు (90) ఆదివారం కన్ను మూశారు. టుటు కుటుంబ సభ్యులతోపాటు దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉదయం కేఫ్ టౌన్ లోని ఒయాసిస్ ఫ్రైల్ కేర్ సెంటర్‌లో టుటు తుదిశ్వాస విడిచారు. అని ఆయన కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మృతికిగత కారణాలను అందులో వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా నైతిక దిక్సూచిగా పేరుపొందిన టుటు 1980 ల్లో స్థానికంగా నల్లజాతీయులపై క్రూరమైన అణచివేత పాలనకు జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖుల్లో ఒకరు.

ఎల్‌జీబీటీల హక్కుల కోసం గళమెత్తారు. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఎన్నికైనప్పుడు ట్రూత్ అండ్ రీకన్సిలియయేషన్ కమిషన్ ను నిర్వహించే బాధ్యతలను 1995 లో టూటుకు అప్పగించారు. ఆయన అహింసాయుత పోరాటానికి గుర్తింపుగా 1984 లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జొహన్నెస్‌బర్గ్‌కు మొదటి నల్లజాతి బిషప్‌గా, తరువాత కేప్ టౌన్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. కొన్నాళ్లు క్షయవ్యాధి పీడితుడైన టుటుకు 1997 లో ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ కాగా, కొన్నేళ్లుగా దాని చికిత్సకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లతో ఆయన చాలాసార్లు ఆస్పత్రిలో చేరారు.

అత్యుత్తమ తరాన్ని కోల్పోయాం : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా నివాళి

దక్షిణాఫ్రికా విముక్తి కోపం పోరాడిన యోధుల్లో టు టు ఒకరని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా నివాళి అర్పించారు. అలాంటి అత్యుత్తమ తరాన్ని దక్షిణాఫ్రికా కోల్పోయిందని ఆయన సంతాపం వెలిబుచ్చారు. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ ( సత్యవాదం… సయోధ్య) కమిషన్‌లో ఆయన విశిష్టమైన పాత్ర నిర్వహించారని, అణగారిన వర్గాల విముక్తి కోసం, సముద్ధరణ కోసం అంకితమయ్యారని ప్రశంసించారు. టుటు ఆత్మ ప్రశాంతిగా విశ్రాంతి తీసుకొంటోందని, ఆయన స్ఫూర్తి దక్షిణాఫ్రికా దేశాన్ని ముందుకు నడిపిస్తుంటుందని పేర్కొన్నారు.

అసంఖ్యాక ప్రజానీకానికి దారి చూపే వెలుగు బాట టుటు : ప్రధాని మోడీ

టుటుకు నివాళి అర్పిస్తూ భారత ప్రధాని మోడీ టుటు ప్రపంచం లోని అసంఖ్యాక అణగారిన ప్రజానీకానికి దారి చూపే వెలుగుబాట అని ప్రశంసించారు. మానవ హక్కుల్లో సమానత, గౌరవం కోసం ఆయన సాగించిన పోరాటం నిరంతరం గుర్తు ఉంటుందని పేర్కొన్నారు. ఆయన మరణం తనకు తీరని విషాదం కలిగించిందన్నారు.

మండేలాకు అత్యంత ఆప్తుడు టుటు :ఎన్‌ఎంఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెల్లోహటాంగ్

నెల్సన్ మండేలాకు అత్యంత ఆప్తుడు టుటు అని, మండేలా జైలు నుంచి విముక్తి పొందిన మొదటి రోజు రాత్రి కేప్‌టౌన్ లోని బిషప్స్‌కోర్టులో టుటు ఇంటి వద్దనే గడిపారని నెల్సన్ మండేలా ఫౌండేషన్ (ఎన్‌ఎంఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెల్లోహటాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటి నుంచి 2013 లో మండేలా అంతిమ క్షణాల వరకు వారిద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారన్నారు. టుటుతో తాను కలిసి అనేక ప్రాజెక్టులు చేపట్టగలిగానని గుర్తు తెచ్చుకున్నారు.

ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత టుటు : రాహుల్ గాంధీ నివాళి

నోబిల్ శాంతిబహుమతి గ్రహీత డెస్మంట్ టుటు మరణానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే అలాంటి యోధుడు ప్రపంచం లోని మనందరికీ స్ఫూర్తి ప్రదాతని కొనియాడుతూ నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News