Monday, January 20, 2025

నామినేషన్ డిపాజిట్ కోసం రెండు సంచుల నిండా నాణేలు సమర్పణ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీనగర్ ఉత్తర నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేంద్ర భాయ్ పట్నీ డిపాజిట్ కింద రూపాయి నాణేలు చెల్లించాడు. రూ. 10 వేల విలువచేసే నాణేలను రెండు సంచుల నిండా నింపి ఎన్నికల అధికారులకు అందజేశాడు. ‘ఇలా ఎందుకు చేశారు?’ అని అడిగితే, తాను ఓ దినసరి కూలీనని, ఉండడానికి ఇల్లు, తాగునీటి సదుపాయం కూడా తనకు లేదని చెప్పుకొచ్చాడు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తే…చుట్టుపక్కల వారు ఎవరైతే తనకు ఓటు వేస్తానని మాటిచ్చారో వాళ్ల నుంచి ఒక్కో రూపాయి సేకరించి డిపాజిట్ కింద చెల్లించానని పేర్కొన్నాడు.

గాంధీనగర్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో లీలా హోటల్ నిర్మాణం కోసం ఇటీవల తమ ఇళ్లను కూలగొట్టారని, దాంతో దాదాపు 521 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అందులో తమ కుటుంబం ఒకటని మహేంద్ర భాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదని వాపోయాడు. తనలా నష్టపోయిన కుటుంబాల వారికి న్యాయం చేయడానికి తాను ఎన్నికల్లో పోటీచేస్తున్నాని తెలిపారు. తనకు ఎలాంటి స్థిర, చరాస్థులు లేవని, కనీసం బ్యాంకు అకౌంట్ కూడా లేదని వివరించాడు. ఎన్నికల్లో పోటీ చేసే వారికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరైనందున తాను జీరో బ్యాంక్ ఖాతా తెరిచినట్లు పేర్కొన్నాడు. గాంధీనగర్ స్టేషన్ రోడ్డులో ఓ పూరిగుడిసెలో తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు ఆడపిల్లలతో జీవిస్తున్నట్లు తెలిపాడు. గాంధీనగర్ ఉత్తర నియోజకవర్గానికి మహేంద్రభాయ్‌తో పాటు 28 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. రెండో విడత పోలింగ్ డిసెంబర్ 5న జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News