కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేసిన అభ్యర్థి
షాజహాన్‌పూర్ : ( ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ లోని సంయుక్త్ వికాస్ పార్టీ అభ్యర్థి వైద్యరాజ్ కిషన్ పీపీఈ కిట్‌లో వచ్చి దాఖలు చేసిన నామినేషన్ చివరకు తిరస్కరణకు గురైంది. సరైన పత్రాలు సమర్పించక పోవడంతో తిరస్కరించినట్టు అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న అభ్యర్థి అక్కడి కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి బోరున విలపించారు. ఓ కేంద్ర మంత్రితో అధికారులు కుమ్మక్కై తన నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. వైద్యరాజ్ కిషన్ జనవరి 25న పిపీఈ కిట్ ధరించి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో శానిటైజర్, థర్మల్ స్కానర్ లను కూడా తన వెంటతెచ్చుకున్నారు. అయితే అధికారులు నామినేషన్ పత్రాలు పరిశీలించి, మరిన్ని పత్రాలు అవసరమని సూచించారు. అయితే అలా వచ్చిన తనను అధికారులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నట్టు కిషన్ ఆరోపించాడు.
చివరకు అధికారులు కోరిన పత్రాలు తెచ్చి ఇవ్వడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. తరువాత వాటిని పరిశీలించిన అధికారులు కిషన్ నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఆదివారం వెల్లడించారు. కేంద్ర మంత్రి సూచనతో అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని కిషన్ ఆరోపించగా, అఫిడవిట్‌తోపాటు సరైన పత్రాలు సమర్పించనందువల్లే అతడి నామినేషన్ తిరస్కరణకు గురైందని జిల్లా ఎన్నికల అధికారి దేవేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. దీనికి కేంద్రమంత్రి సురేష్ ఖన్నా స్పందిస్తూ ఈ ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా వైద్యరాజ్ కిషన్ ఇప్పటివరకు 18 ఎన్నికల్లో పోటీ చేశారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు.