Sunday, December 22, 2024

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

ఏకాదశి, నామినేషన్లకు ఒక రోజే గడువు ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలు
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతల నామినేషన్లు
భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రాళ్లు విసురుకున్న కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కార్యకర్తలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటం, ఏకాదశిని పురస్కరించుకుని గురువారం రాజకీయ పార్టీల కీలక నేతలు, పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 3న నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. వారం రోజులుగా అంతంత మాత్రంగా నామినేషన్లు దాఖలు కాగా..గురువారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేయగా, సిరిసిల్లలో మంత్రి కెటిఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్ దాఖలు వేశారు.

సనత్‌నగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జిహెచ్‌ఎంసి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జబ్బార్ కాంప్లెక్స్ నుంచి జిహెచ్‌ఎంజి కార్యాలయం వరకు వందలాది మందితో కలిసి తలసాని ర్యాలీ నిర్వహించారు. ఎల్‌బినగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జిహెచ్‌ఎంసి ఈస్ట్ జోన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో, మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో నామినేషన్ వేశారు. ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాసం నుంచి భారీగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరి ఆర్‌డిఒ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్‌లో బిఅర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మధిరలో భట్టి, హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ నామినేషన్
కాంగ్రెస్ కీలక నేతలు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మధిరలో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క నామినేషన్ వేయగా, బిఅర్‌ఎస్ అభ్యర్థిగా కమల్‌రాజ్ నామినేషన్ వేశారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థుల భారీ ఎత్తున నామినేషన్లు సమర్పించారు.
అంబులెన్స్ లో వెళ్లి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఇటీవల ఎన్నికల ప్రచారంలో దుబ్బాక కత్తిపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి వీల్ చైర్‌లో వెళ్లి నామినేషన్ వేశారు. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో దుబ్బాకకు వెళ్లిన ఆయన.. వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు దుబ్బాక పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే రోజు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్‌తో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం నామినేషన్ వేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయటంతో ఆ ప్రాంతమంతా ర్యాలీలు, జెండాలు, మైకుల మోతతో మార్మోగింది. ఉదయమే నామినేషన్ వేసిన ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆర్‌ఒ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే మరోవైపు మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా వచ్చారు. ఇరువర్గాలు బస్సు డిపో వద్ద ఎదురుపడగా.. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగి.. ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున పోలీసులు మోహరించినా అదుపుచేయటం కష్టంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు లాఠీలకు పనిజెప్పిన పోలీసులు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News