Wednesday, December 25, 2024

ముగిసిన కీలక ఘట్టం

- Advertisement -
- Advertisement -

చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు
అట్టహాసంగా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం, పటాన్‌చెరులో ఉద్రిక్తత
కాంగ్రెస్, బిఎస్పీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు
కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి, హుజురాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్
ఎక్కువ మంది రావడంతో టోకెన్ పద్దతిలో అభ్యర్థులకు అనుమతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మంది మార్బలంతో తరలివచ్చారు. దీంతో పలు జిల్లాలో ట్రాఫిక్ జాంతో పాటు పటాన్‌చెరులో కాంగ్రెస్, బిఎస్పీ అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపులుగా ఉన్నవారి చెదరగొట్టారు.

టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి శుక్రవారం కామారెడ్డిలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి నామినేషన్ వేశారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సిర్పూర్‌లో బిఎస్పీ అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్ల వేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు తన రాజకీయ బలం చూపించేందుకు పెద్ద సంఖ్యలో జనాలను తరలించి బతుకమ్మ, బోనాలు, కళాకారుల ఆటపాటలతో విన్యాసాలు చేస్తూ కిలోమీటర్ల కొద్ది బైక్ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్వో కార్యాలయానికి ఎక్కువ మంది అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేయడానికి రావడంతో టోకెన్ పద్దతిన అనుమతి ఇచ్చారు.

నామినేషన్ దాఖలు చేసిన సమయం నుండి అభ్యర్ధి ఖర్చు వ్యయ పరిశీలకులు లెక్కించనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి గజ్వేల్‌లో దాదాపు 190, కామారెడ్డిలో 140కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. విద్యార్థులు, యువత, రైతులు, అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్లు వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,399 నామినేషన్లు దాఖలు కాగా అందులో 456 తిరస్కరకు గురైయ్యాయి. మరో 367 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత వీరిలో 1,569 మందికి డిపాజిట్లు కూడా రాలేదు. ఈ నెల 3వ తేదీ నుంచి గురువారం వరకు 2028 నామినేషన్లు దాఖలు కాగా శుక్రవారం దాదాపు అంతే సంఖ్యలో దాఖలైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్టంగా మల్కాజిగిరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే… ఈసారి గజ్వేల్, కామారెడ్డి నామినేషన్ల వేశారు.

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉద్రికత్త
పటాన్‌చెరు నియోజకవర్గ నామినేషన్ల కేంద్రం వద్ద ఒకేసారి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకేసారి రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపైనే బైఠాయించారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆర్వో కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డకున్నారు. అనంతరం అభ్యర్థులు సౌమినేషన్ దాఖలు చేసి వెళ్లిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News