Friday, January 10, 2025

ఖర్గే x థరూర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన కర్నాటక సీనియర్ నేత
మద్దతుగా పోటీనుంచి తప్పుకున్న దిగ్విజయ్
నామినేషన్లు వేసిన ఇరువురు నేతలు
బరిలో జార్ఖండ్ మాజీ ఎంపి త్రిపాఠీ కూడా..
అయినా పోటీ ఆ ఇద్దరి మధ్యే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో ఎఐసిసి కార్యాలయం వద్ద సందడి నెలకొంది. శుక్రవారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో ఎవరెవరు నామినేషన్లు దాఖలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. ఖర్గేతో పాటుగా శశి థరూర్, జార్ఖడ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠీలు అధ్యక్ష పదవికి నామినేషన్లు వేశారు. ఖర్గే తెరపైకి రావడంతో నిన్నటిదాకా పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీనుంచి తప్పుకోవడమే కాకుండా ఖర్గేకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఈ పదవికి పోటీ చేస్తానని అందరికంటే ముందే ప్రకటించిన తిరువనంతపురం ఎంపి శశి థరూర్ అందరికంటే ముందుగా నామినేషన్ వేశారు. శుక్రవారంమధ్యాహ్నం డప్పు వాయిద్యాలు, అభిమాన కార్యకర్తల గణంతో థరూర్ ఎఐసిసి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంచైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఉదయం శశిథరూర్ రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

అటు సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా నామినేషన్ వేశారు. అధ్యక్ష పదవికి ఆయన చివరి నిమిషంలో బరిలో నిలిచారు. ఈ పదవికి పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను కోరినట్లు తెలుస్తోంది గాంధీల విధేయుడిగా పేరున్న 80 ఏళ్ల ఖర్గేకు హైకమాండ్‌తో పాటుగా పార్టీలో అత్యధికుల మద్దతు కూడా ఉంది. అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్, ముకుల్‌వాస్నిక్ వంటి సీనియర్ నేతలతో పాటుగా జి23నేతలయిన మనీశ్ తివారీ,ఆనంద్ శర్మ వంటి వారు కూడా ఖరేకే మద్దతు ప్రకటించారుఖర్గే నామినేషన్ పత్రాలను ప్రతిపాదించిన వారిలో ఆనంద్‌శర్మ, పృథ్వీరాజ్ చౌహాన్, మనీశ్ తివారీ, భూపిందర్ హూడా వంటి వివిధ రాష్ట్రాల నేతలు ఉండడంతో ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.‘ ఎన్నికల్లో పోటీ చేయాలని అందరు నాయకలు, కార్యకర్తలు, కీలక రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు నన్ను ప్రోత్సహించారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో నా పక్కన ఉన్న నేతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఖర్గే అన్నారు.

అయితే థరూర్, ఖర్గే నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో గాంధీ కుటుంబానికి చెందిన నేతలు ఎవరు కూడా ఎఐసిసి కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నానని, తాను చిన్ననాటినుంచి అనుబంధం కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పరిరక్షించడానికి మరితంగా పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఖర్గే తెలిపారు. కాగా తన ఎన్నికల ప్రత్యర్థి ఖర్గేను శశి థరూర్ ‘భీష్మ పితామహుడి’గా అభివర్ణించారు. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి బహిరంగ ప్రజాస్వామ్య ప్రక్రియ కలిగిఉన్న దేశంలో ఏకైక పార్టీ అయిన కాంగ్రెస్‌కు సేవ చేయడం అదృష్టంగా భావిస్తానని నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం విలేఖరులతో అన్నారు.

స్నేహపూర్వక పోటీ జరుగుతుందని, తామేమీ శత్రువులం కానీ, ప్రత్యర్థుం కానీ కాదని ఆయన అంటూ ఖర్గే అంటే తనకెలాంటి అగౌరవం లేదని, అయితే తాను తన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తానని అన్నారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే హైకమాండ్ సంస్కృతిని మార్చేస్తానని కూడా ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా అధ్యక్ష పదవికి మరో నామినేషన్ కూడా దాఖలయింది. అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ చేస్తున్నట్లు జార్ఖండ్ మాజీ మంత్రి త్రిపాఠీ ప్రకటించారు. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. త్రిపాఠీ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఖర్గే, థరూర్‌ల మధ్యే ఉంటుందనేది సుస్పష్టం.

తప్పుకొన్న డిగ్గీ రాజా

కాగా నామినేషన్ల దాఖలకు చివరి రోజయిన శుక్రవారం నాడు అనూహ్యంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష పదవికి పోటీనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తున్నందునే తాను బరిలో నిలవడం లేదని తెలిపారు. ఖర్గేకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో దిగ్విజయ్ చెప్పారు.

మేనిఫెస్టో తెచ్చిన తంటా.. థరూర్ క్షమాపణ

కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా శవఙథరూర్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆయననులేనిపోని చిక్కుల్లో పడేసింది.తన మేనిఫెస్టో బుక్‌లెట్‌లో ‘ థింక్ టుమారో, థింక్ థరూర్’ అనే ట్యాగ్‌లైన్‌తో భారత దేశం అంతటా ఉన్న కాంగ్రెస్ యూనిట్లను సూచించే చుక్కల నెట్‌వర్క్‌తో కూడిన మ్యాప్‌ను ఉపయోగించారు. అయితే ఈ మ్యాప్ భారత దేశ అధికారిక మ్యాప్‌కు భిన్నంగా ఉంది. జమ్మూ, కశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలు లేని భారత మ్యాప్‌గా రూపొందించారు. దీంతో ఈ మేనిఫెస్టో కాస్తా సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదంగా మారింది. నెటిజన్లు ఇది వికేంద్రీకరణ, విభజన అంటూ మండిపడ్డారు. బిజెపి సైతం థరూర్‌పై విరుచుకు పడింది. బిజెపి నేతలు సందీప్ పాత్రా వంటి వారు విమర్శలు చేయడంతో థరూర్ కార్యాలయం ఆ తర్వాత మేనిఫెస్టోకు మార్పులు చేయడంతో పాటుగా ఆ ట్వీట్‌ను తొలగించింది. అంతేకాదు మ్యాప్‌ను తప్పుగా ఉంచినందుకు శశిథరూర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News