Saturday, March 15, 2025

పద్మ అవార్డులకు నామినేషన్లు..జూలై 31 వరకు గడువు

- Advertisement -
- Advertisement -

అసాధారణ విజయాలు సాధించిన, సేవలు అందించిన విశిష్ట వ్యక్తులకు ప్రదానం చేసే 2026 పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫార్సుల ప్రక్రియ శనివారం మొదలైంది. 2026 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం నామినేషన్లకు, సిఫార్సులకు చివరి తేదీ జూలై 31 అని అధికార ప్రకటన తెలియజేసింది. పద్మ అవార్డుల నిమిత్తం నామినేషన్లు, సిఫార్సులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (అవార్డ్.గవ్.ఇన్)పై ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు. 1954లో ప్రవేశపెట్టిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుంటారు. ‘విశిష్ట కృషి’కి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తుంటారు. ఆ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్,

ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమ వంటి అన్ని రంగాలు, విభాగాల్లో విశిష్ట, అసాధారణ విజయాలు సాధించిన, సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తుంటారు. జాతి, వృత్తి. పదవి, లింగభేదం లేకుండా అందరూ ఈ అవార్డులకు అర్హులని ఆ ప్రకటన తెలిపింది. అయితే, వైద్యులు, శాస్త్రవేత్తలు కాకుండా, పిఎస్‌యులలో పని చేస్తుండే వారితో సహా ప్రభుత్వోద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పద్మ పురస్కారాల ప్రదానం ద్వారా ‘సాధారణ హీరోలను’ సత్కరించనారంభించినట్లు, తద్వారా పద్మ అవార్డులను ‘ప్రజల అవార్డులు’గా మార్చినట్లు అధికారులు తెలియజేశారు. అందువల్ల స్వీయ నామినేషన్‌తో సహా నామినేషన్లు, సిఫార్సులు చేయవలసిందిగా పౌరులు అందరికీ వారు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News