వచ్చే సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా ప్రకటించనున్న ‘పద్మ అవార్డులు 2026’ కోసం నామినేషన్లు, సిఫార్సుల ప్రక్రియను కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) ప్రారంభించింది. పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫార్సులకు ఆఖరి తేదీ జూలై 31 అని, వాటిని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (అవార్డ్.గవ్.ఇన్)పై ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారని శుక్రవారం విడుదలైన ఒక అధికార ప్రకటన తెలియజేసింది. పద్మ అవార్డులు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. 1954లో ప్రవేశపెట్టిన ఈ అవార్డులను ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు ప్రకటిస్తుంటారు. ‘విశిష్ట కృషికి’చ అన్ని రంగాలు, కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సాంఘిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వర్తక, పరిశ్రమ మొదలైన విభాగాలలో విశిష్ట, అసాధారణ విజయాలకు, సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తుంటారు.
కులం, జాతి, వృత్తి, హోదా లేదా లింగ వివక్ష లేకుండా ప్రజలు అందరూ ఈ అవార్డులకు అర్హులు. అయితే, డాక్టర్లు, సైంటిస్టులు మినహా పిఎస్‌యులలో పని చేస్తున్నవారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అనర్హులు. పద్మ అవార్డులను ‘ప్రజల అవార్డులు’గా మార్చేందుకు ప్రభుత్వం నిబద్దమై ఉందని అధికార ప్రకటన తెలిపింది. అందువల్ల స్వీయ నామినేషన్ సహా నామినేషన్లు, సిఫార్సులు చేయవలసిందిగా పౌరులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొన్నది. మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్నవారిలో గుర్తింపునకు నిజంగా అర్హులైన, ఘనత సాధించిన ప్రతిభావంతులను గుర్తించేందుకు పటిష్ఠ కృషి జరుగుతుందని ప్రకటన సూచించింది. వివిధ మార్గాల్లో సమాజానికి సేవ చేస్తున్న ‘గుర్తింపు లభించని హీరోలు’
అనేక మందిని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి పద్మ అవార్డులతో సత్కరిస్తోందని అధికారులు తెలియజేశారు. నామినేషన్లు, సిఫార్సులను, (గరిష్ఠంగా 800 పదాలతో) వివరణాత్మక పత్రంతో సహా పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో సంబంధిత వివరాలు అన్నీ పొందుపరచవలసి ఉంటుంది. ఆయా రంగంలో లేదా విభాగంలో సిఫార్సు చేసిన వ్యక్తి విశిష్ట, అసాధారణ ఘనతలు/ సేవను స్పష్టంగా ఆ పత్రంలో పేర్కొనాలి.