Monday, December 23, 2024

కోర్టుకు హాజరు కాని శశికళ.. నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకె మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరు లోని ప్రత్యేక లోకాయుక్త కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బెంగళూరు లోని జైలులో ఆమె నిర్బంధంలో ఉన్న సమయంలో ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ నగరం లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో నిందితురాలు శశికళ కోడలు ఇళవరసికి కూడా కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎఐఎడిఎంకె మాజీ నాయకురాలికి ష్యూరిటీలు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులకు కూడా కోర్టు నోటీస్‌లు జారీ చేసింది. ఈ విచారణను అక్టోబర్ 5 కి వాయిదా వేసింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసిలను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించి నాలుగేళ్లు గడిచింది. పరప్పన సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ప్రత్యేక ట్రీట్ మెంట్ పొందేందుకు జైలు అధికారులకు ఆమె లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే కర్ణాటక హైకోర్టు ఈ ఏడాది మేలో శశికళతో పాటు నిందితులుగా ఉన్న ముగ్గురు జైలు అధికారులపై కేసు కొట్టివేసింది. అయితే లోకాయుక్త కోర్టులో ఆమెపై విచారణపై హైకోర్టు స్టే విధించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు శశికళ ప్రత్యేక కోర్టుకు హాజరు కాలేదు. ఆమె పదేపదే గైర్హాజరు అవుతున్నకారణంగా కోర్టు తీవ్రంగా పరిగణించి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News