Tuesday, November 5, 2024

ఆగస్టు 3 నుంచి గాంధీలో నాన్‌కోవిడ్ సేవలు

- Advertisement -
- Advertisement -

Non-covid services in Gandhi hospital from August 3

అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
పరికరాలు, పడకలు, వార్డుల మరమ్మత్తులు చేస్తున్న వైద్యశాఖ
సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారుల ఆదేశాలు
గతంలో ఉన్న క్యాజువాలిటీ, ఓపి,ఐపీ భవనాల్లో సాధారణ రోగులకు సేవలు

హైదరాబాద్: నగరంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు ఆగస్టు 3 నుంచి ప్రారంభించి పేద ప్రజలకు వైద్య సేవలందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. సెకండ్ వేవ్ విజృంభణ చేయడంతో ఆసుపత్రిని కరోనా నోడల్ కేంద్రంగా చేసి ఏప్రిల్ 15 వ తేదీ నుంచి పూర్తిగా ఆసుపత్రి వైద్యసిబ్బంది కరోనా రోగులకు చికిత్స అందించారు. దీంతో నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సాధారణ రోగులు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సేవలు పునరుద్దరించనున్నట్లు దవఖాన సూపరింటెండెంట్ డా. రాజారావు తెలిపారు. అన్ని రకాలు సేవలు ప్రారంభిస్తామని రోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇకా నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదని, కరోనా కంటే ముందు నిలిచిపోయిన శస్త్రచికిత్సలు, చర్మ సంబంధమైన వ్యాధిగ్రస్తులకు ట్రీట్‌మెంటు ప్రారంభిస్తామని, గతంలో ఉన్నట్లు అన్ని బ్లాక్లులు తెరిచి ఉంటాయని, ఓపి ద్వారా కొత్తవారు వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు.

దీనికి తోడు గాంధీలో సాధారణ సేవలు లేకపోవడంతో రోగులంతా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లుతున్నారు. రోజుకు 1800మందికి ఓపి వైద్య సేవలు అందిస్తున్నారు. రోగుల రద్దీని గుర్తించిన వైద్యశాఖ ఉన్నతాధికారులు గాంధీలో సేవలు ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. నగరంలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బస్తీ దవఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడం అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో గాంధీలో సేవలు అందుబాటులోకి తేవాలని స్దానిక ప్రజలు కోరుతున్నారు. దీంతో ఆసుపత్రి అధికారులు గతంలో ఉన్నట్లు క్యాజువాలిటీ, ఓపి, ఐపీ భవనాల్లో సాధారణ రోగులకు సేవలు అందిస్తామని, రెండవ అంతస్దుతో పాటు లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగులతో ,బ్లాక్‌పంగస్ రోగులకు చికిత్స చేస్తామని, అదే విధంగా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

అదే విధంగా మెడికల్ విద్యార్దులు కూడా క్లినిక్ శిక్షణలో వెనకబడుతామని, త్వరలో సేవలు ప్రారంభించి తనకు తర్పీదు ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. గాంధీ ఆసుపత్రి రోగులకు నాణ్యమైన వైద్యం అందిచేందుకు నూతన పరికరాలు, పడకలు, స్టెచర్లు, వార్డుల్లో మరుగుదొడ్లు పూర్తిగా కొత్తవి ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా కోవిడ్‌వార్డు, పోస్టు కోవిడ్ వార్డులకు ప్రత్యేక నియమిస్తున్నట్లు, వారు ఇతర వార్డులోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 150 పడకలు కోవిడ్ , 100 పడకలు పోస్ట్ కోవిడ్, 900 పడకలు సాధారణ రోగుల కోసం సిద్దం చేస్తున్నట్లు గాంధీ వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News