తుమకూరు: కర్నాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోశాల గుబ్బి చన్నబసవేశ్వర ఆలయంలో గురువారం నుంచి డూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల సందర్భంగా కొత్త వివాదం రాజుకుంది. చారిత్రాత్మకమైన ఈ ఆలయ పరిసరాలలో హిందూ మతస్తులు కాని వారెవరూ వ్యాపారాలు చేయకుండా నిరోధించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్ తుమకూరు పట్టన డిప్యుటీ కమిషనర్‌కు ఒక పిటిషన్‌ను సమర్పించాయి. కాగా..అవాంఛనీయ సంఘనలు జరగకుండా అధికారులు ఆలయ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఉత్సవాలు జరుగుతున్న కాలంలో ఆలయానికి 100 మీటర్ల విస్తీర్ణంలో అన్యమతస్తులు ఎవరూ ప్రత్యోంగా లేక పరోక్షంగా వ్యాపార కార్యకలాపాలు ఏవీ నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, అలా తీసుకోని పక్షంలో తాము సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ రెండు హిందూ సంస్థలు తమ పిటిషన్‌లో హెచ్చరించాయి. ముజ్రయ్ శాఖ(దేవాదాయ ధర్మాదాయ)లోని సంబంధిత చట్టానికి చెందిన నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆ రెండు సంస్థలు పోలీసులను కోరాయి. ఈ చట్ట నిబంధనల ప్రకారం అన్యమతస్తులు ఎవరూ ఆలయాలు, మత సంబంధ ప్రదేశాల ప్రాంగణాలలో వ్యాపారాలు చేయరాదని, ఈ చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిందేనని విహెచ్‌పి అధ్యక్షుడు సికె శ్రీనివాస్ కోరారు. తాజా పరిణామంతో కర్నాటకలో బహిష్కరణ పర్వం మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది.