జమ్మూ: దక్షిణ కశ్మీరులోని పుల్వామాలో సోమవారం రాష్ర్టేతరుడైన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకేష్‌గా గుర్తించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి.
పుల్వామా జిల్లాలోని తుంచి గ్రామంలో కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులలలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు ఆ తర్వాత మరనించినట్లు వారు చెప్పారు. శ్రీనగర్‌లో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఈ ఏడాదిలో ఇది రెండవ సంఘటన. జులై 13న సోనియాన్ జిల్లాలోని గాగ్రమ్ గ్రామంలో బీహార్‌కు చెందిన ముగ్గురు భవన నిర్మాణ కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా వారు గాయపడ్డారు.
2019లో జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత వలస కార్మికులపై దాడులు మొదలయ్యాయి. గత ఏడాది రాజస్థాన్‌కు చెందిన ఒక బ్యాంకు మేనేజర్‌తోసహా 10 మంది రాష్ర్టేతర కార్మికులు ఉగ్రవాదుల కాల్పులలో మరణించగా అనేక మంది గాయపడ్డారు.