Monday, December 23, 2024

తొమ్మిదేళ్ళ కింది పులకరింత

- Advertisement -
- Advertisement -

సంజీవరెడ్డి మామా/సునోజీ మేరే గానా/కహతా హై తెలంగాణ/ ఇన్సాన్ తుమ్‌కో మానా/ఐసా కభీ న జానా/బందర్ కే కార్నామా/బాతేఁతో లాక్ బోలా/బహుత్ జల్ద్ మగర్ భూలా/హోగయే తేరా హవాలా/నికల్ గయా దివాలా/ఛోడోజీ తెలంగాణ/ ఛలే జావో రాయలసీమ” అంటూ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన వెంటనే ధిక్కార గీతాలాపన చేసాడు ముచ్చెర్ల సత్యనారాయణ. ఎందుకంటే ప్రమాణస్వీకారం రోజే ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కాడు. ఆంధ్రప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుండి ఒకరిని ఉపముఖ్యమంత్రిగా నియమించుకోవాలన్నది ఒప్పందంలోని ఒక నిబంధన. అటు బెజవాడ గోపాలరెడ్డి ఇటు బూర్గుల రామకృష్ణారావుల పదవీ త్యాగాల అనంతరం ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నీలం సంజీవరెడ్డిని విలేఖరులు ’ఉపముఖ్యమంత్రిని ఎప్పుడు నియమిస్తారు?’ అని ప్రశ్నించారు. దానికి బదులిస్తూ ’ఉపముఖ్యమంత్రి పదవి ఆరోవేలు లాంటిది. అది అలంకారానికే తప్ప ఏ పనికీ పనికిరాదు’ అన్నాడు.

అలా మొదలైన ఉల్లంఘనలు, తెలంగాణ రక్షణ పట్ల ఉదాసీనత, వనరుల వినియోగంలో హేతుబద్ధత లేకపోవడం వల్ల తెలంగాణవాదులు కలవరానికి గురయ్యారు. పది పన్నెండు సంవత్సరాలలోనే అసంతృప్తి రాజుకొని తీవ్రమయింది. తెలంగాణ ప్రజాసమితి మెరుపువేగంతో ఉద్యమాన్ని ప్రజల దగ్గరకు తీసుకుపోయింది. ’నాన్ ముల్కీ గోబ్యాక్’ నినాదపు స్ఫూర్తి అప్పటికింకా సజీవంగానే ఉండడంతో జైతెలంగాణ కొన్ని నెలల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత తెలంగాణ ప్రాంతం వాడైన పీవీని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రేసు అధిష్టానం.
‘పుట్టింది ఆంధ్ర పుటుక/పెరిగింది తెలంగాణ/డబ్బంత దోచినావు/ఆంధ్రోళ్ళకిచ్చినావు/ ఓ బ్రహ్మానందరెడ్డి/ నీ బ్రతుకు బంజరుదొడ్డి’ అని అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలంగాణ ముక్తకంఠంతో వ్యతిరేకించింది. పీవీ ముఖ్యమంత్రిత్వంతో తాత్కాలికంగా ఉద్యమాన్ని తొక్కిపెట్టినప్పటికీ ప్రజల మనస్సులలోని ప్రత్యేక రాష్ట్రవాంఛలు పూర్తిగా సమసిపోలేదు. తెలుగుదేశం అధికారం చేపట్టాక ఆంధ్రుల వలసలు అలవి కానంతగా పెరిగిపోవడంతో మలితెలంగాణకు మేథోమధనం ప్రారంభమయింది. కేసీఆర్ ఆ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే క్రమంలో తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ప్రజా ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి సీమాంధ్రుల అలజడితో వెనక్కి తీసుకుంది. అలా ఆరంభించబడిన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెనక్కి తీసుకోవడంతో తెలంగాణలో తటస్థంగా ఉన్న ప్రజలు కూడా రోడ్డెక్కారు.

రాష్ట్రోద్యమం పూర్తి ప్రజా ఉద్యమంగా మారింది. ఎవరు ఔనన్నా, కాదన్నా రాష్ట్రం ఇవ్వడం అనివార్యమయింది. అప్పటి ఏఐసీసీ అధ్యకక్షురాలు సోనియాగాంధీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసారు. సుమారు పదిహేను స॥ల పాటు సాగిన మలిథ ఉద్యమంలో చివరి రెండు సం॥లు అత్యంత కీలకమైనవి. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి సాహిత్యమే ముందు నడిచింది. మేధావులు వ్యాసాలు రాసారు. కవులు, రచయితలు కథలు, కవిత్వం ద్వారా ఉద్యమ చైతన్యాన్ని రగిలించారు. గాయకులు ఉద్యమాన్ని సామాన్య ప్రజల దగ్గరకు చేర్చారు. వేలాది కవితలు, పాటలు, కథలు, నవలలు ఉద్యమాన్ని చిత్రిస్తూ వచ్చాయి. డజన్లకొద్ది కవిత్వ సంకలనాలు, వ్యక్తిగత సంపుటాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన సంపుటి ’పొక్కిలి వాకిళ్ళ పులకరింత’.
వాకిళ్ళు పొక్కిలవడం ఒక సంకేతం. తెలంగాణ జీవన విధానం విధ్వంసానికి గురయిందనే అర్థాన్ని కవి అన్నవరం దేవేందర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సంపుటి కంటే ముందు ఇదే పదాన్ని స్ఫుర్తింపజేస్తూ ’పొక్కిలి’, తెలంగాణ పూర్వజీవన విధానాన్ని తలపించే ’మత్తడి’, అనివార్యమైన పోరాట తత్వాన్ని తలపోసే ’జులూస్’ కవితా సంకలనాలొచ్చి ఒక అనివార్య పోరాట వాతావరణాన్ని ఏర్పరిచాయి. మలిథ ఉద్యమ కవిత్వంలో పాట పాయ చాలా పెద్దది. పాటేతర కవిత్వరూపాలలో వచన కవిత్వానిదే సింహభాగం. పూర్వవైభవంగా కీర్తించడం, పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకోవడం, వలసదారులను వ్యతిరేకించడం, రాష్ట్ర సాధనకు తిరుగులేని విధంగా పోరాడాలని ఉద్బోధించడం కవిత్వం చేసిన పని.

2012 నుండి తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న అభిప్రాయం తెలంగాణ వారందరిలో స్థిరపడింది. అలాంటి ఖచ్చితమైన కాలంలో రాయబడిన 39 కవితల సంపుటి ’పొక్కిలి వాకిళ్ళ పులకరింత’. ఇష్టంగా ఈ సంపుటిని రాష్ట్రం ఆవిర్భవించిన రోజున ఆవిష్కరణ చేసినట్లు ప్రచురించారు కూడా. అందుకు కారణం ‘పాఠ్యపుస్తకాల్లోని పాత పుటలు చింపేసి/కొంగొత్తగ మన రణచరిత్రను అచ్చుగొట్టిచ్చాలే/కూకోని పెత్తనం చెలాయించేటోల్లను తప్పించి/రెక్కలు బొక్కలు జేసుకునేటోల్లను మెప్పించాలె/ఆధిపత్య పెత్తనపు అంగి ఇడిశి పారేశి/పెద్దంత్రం చిన్నంత్రం లేకుండ బతుకాలె/ మనది మనకైనంకల సమానంగ నిలిచి వెలుగాలె’ అని కవి అంతరంగంలో ఉన్న ఆకాంక్ష. నిజానికి ఇది ఒక్క అన్నవరం దేవేందర్ ఆకాంక్ష కాదు. అందరు కవులు, రచయితల, బుద్ధిజీవుల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష ఈ సంకలనంలో అడుగడుగునా వ్యక్తమయింది. రాష్ట్రం రెండుగా విడిపోతున్నప్పుడు కలిగిన ఆనందాన్ని ఒక్కో కవి ఒకో విధంగా వ్యక్తపరిచాడు. అన్నవరం ’అల్కగ’ అనే కవితలో ‘ఇచ్చుకపోతున్న ఇంపైన సందర్భం/ కట్లు తెగిపోతున్న కనికట్టు దృశ్యం/ తెగతెంపులైన తేనెకత్తుల పెత్తనం’ వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అయితే రాష్ట్రఏర్పాటు ప్రక్రియ అంత సజావుగా ఏమీ సాగలేదు. ప్రక్రియను ప్రారంభించకుండా, బిల్లు ఆమోదం పొందకుండా సీమాంధ్ర నాయకులు చేసిన పనులను కవులంతా ఎండగట్టారు. తెలుగుదేశం వాళ్ళు బిల్లు కాగితాలను చించి పారవేసినప్పుడు

‘నీదంతా నీళ్ళు ముల్లెగట్టినట్టే/గాలి పిడికిట్ల పిసికినట్లే/ అసలు ఆ ఆవరణే/ పందిగున్నలు తిరిగే దొడ్డి’ అని వాళ్ళ చేష్టలను ’చిచోర’ అనే కవితగా రాస్తాడు. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు తప్పనిసరైతే హైద్రాబాద్ మాత్రం ఉమ్మడిగా ఉండాలనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు సీమాంధ్రులు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణావాదులు. ఇదే విషయంపై ’హమారా హైద్రాబాద్’ అనే కవిత రాస్తూ ’సికిందరాబాద్ సింగరాయ కొండా కాదు ముర్కసూసి ముట్టుకోను/రంగురంగుల రాజమండ్రి బొమ్మా కాదు/ సికింద్రాబాద్ మా లష్కర్ ఎత్తుకున్న బోనం/ హైద్రాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలంటే/ గుంటూరు గుడివాడ గుగ్గుగుడిసెలు కావు/ అంగట్ల అల్కగ అమ్ముకునేందుకు/ అనకాపల్లి బెల్లం బుట్టలూ కావు/ జంటనగరాలు మా దక్కన్ పీఠభూమి నేత్రాలు” అంటాడు.ఈ సంకలనంలో రాష్ట్రాకాంక్ష కవితలే సింహభాగం అయినప్పటికీ ఇతర వస్తువులూ ఉన్నాయి. సామల సదాశివ, కాళోజీలపై రాసిన ఎలిజీలున్నాయి. నలిమెల భాస్కర్ సర్ పై రాసిన ప్రేమ పద్యం ఉంది. సంతకం ఎంత విశిష్టమైనదో ’దస్తకత్’ కవితలో చెప్పాడు. అటెండర్ అస్తిత్వం ఎంత గొప్పదో ఒకచోట చెబుతాడు.

రైతుల వేదనను ’యూరియా లైను’లో, తల్లి అయ్యేటప్పటి స్త్రీ స్థితిని ’తల్లిమొగ్గ’లో, పురుష క్రౌర్యాన్ని ఎండగట్టే ’నిర్భయ’, గల్ఫ్ వలస కార్మికుల వెతల ’బట్టా పొట్టా’, నడక అవసరాన్ని ’సౌందర్యం’గా అమ్మమ్మ ఆత్మీయతను చెప్పిన ’బెల్లబ్బువ్వ’, మనసు గాయపడితే చేసే ’కవిత్వ చికిత్స’, వృక్షౌన్నత్యాన్ని చెప్పే ’రాలెచెట్టు’ సహనగుణం లేకపోవడమే ’వైకల్యం’ అని, ఎల్.టి.టి.ఇ. నేత ప్రభాకర్ పై రాసిన కవిత ’పులి’, చార్ ధామ్ విషాదాన్ని తలపోసే ’విచార్ ధామ్’, అసహజ బ్రీడింగ్ గేదెలపై ’జీవవైరుధ్యం’, విమానయానం ఫీలింగ్ ను ’మబ్బుల్లో మనస్సు’లో, అమ్మమ్మ గారి ఊరి మీద ప్రేమను ’పెద్దపహాడ్’ లో వ్యక్తం చేసాడు కవి. నిర్మాణపరమైన శ్రద్ధ ఉద్యమ కాలంలో తక్కువే. అయినా కొన్ని కవితల్లో అలవోకగా పద్యం కుదురుకుంటది. ’దుబ్బకాళ్ళు’ శ్రమకు ప్రతీక. ’చెప్పు తోడ్కలు లేని కాళ్ళు/ గెగ్గెలు గెగ్గల కాళ్ళు’ ఎంత విశిష్టమైనవో, ఎందుకు ఆరాధ్యమైనవో చెబుతూ వాటిని ఎందుకు గౌరవించాలో మనకు అర్థం చేయిస్తూ ఇలా ముగిస్తాడు. ’ఇగో ఈ కాళ్ళకు పట్టం గట్టాలె/ఈ కాళ్ళకు కంచు గజ్జెలు కట్టాలె/ గండపెండేరం తొడిగి దండం పెట్టాలె’ ఈ సంపుటిలో భిన్నమైన కవిత ’మేము-వీళ్ళు’. వీళ్ళంటే మరెవ్వరో కాదు,

ఇప్పటితరం పిల్లలు. మనకూ, వాళ్ళకూ ఉన్న తేడాని చిన్న చమత్కారంతో చాలా బాగా అభివ్యక్తం చేసాడు కవి. చూడండి. ‘మేము/మా ఇంటి భాషలనే/’నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని’ ప్రతిజ్ఞ చేసేది/వీళ్ళు/ దేశాన్ని దోచిన భాషలనే/ ’ఐ లవ్ మై కంట్రీ అని చిలకలోలె పలుకుతున్నరు’ ’బానిసత్వం’ అనే కవితలో ఆ పదానికి వ్యవహార రూపాన్ని చాలా బాగా చెప్పాడు కవి. ఇది 18.7.2013న తెలంగాణ వచ్చినంక ఇంక బానిసత్వం ఉండగూడదని రాసాడు. ఎలా రాసాడో చూడండి. ’వంగి వంగి తలకాయను/మెడ లోపలికి మలుచుకొనుడు/నంగి నంగి నాలికను/నన్నన్నని తత్తరవెట్టుడు/ మెదడునైతే/ మోకాళ్ళ పిక్కల మధ్య ఇరికించుడు’ మరిప్పుడు పెరిగిందా తగ్గిందా పాఠకులతో పాటు, కవులూ రచయితలూ ఆలోచించాలె. ఆచరణ ఎట్లుండాలో కూడా ప్రణాళిక వేయాలె. కాకతాళీయమే కావొచ్చు గానీ ఇదే సంపుటిలో ’వాళ్ళుంటేనా’ అని ఒక కవిత ఉంది. అంటే వాళ్ళు ఉంటేనే బాగుండు అని సామాన్యుడు తలపోయాల్సినంత దిక్కుమాలినతనం ఉందన్నమాట. సామాన్యులకు చట్టం అందదు. దుర్మార్గుల దోపిడీకి పగ్గాలుండవు. ఇలాంటి స్థితిలో అడవి నుండి వాళ్ళొస్తేనే దోపిడీదార్లు గజ్జుమంటారు.

ఈ స్థితి అప్పుడేనా? ఇప్పుడు కూడానా? అప్పటికన్నా ఇప్పుడే తక్కువా? ఆలోచించాలె మనం. ‘భూమి తలకాయకు సుట్టుకొని/ఎట్టి చేయించుకున్న అగ్ర అహంకారులు/మల్లా గడీలకు సున్నాలెట్లా ఎస్తురు/పట్నం దాటి కాలు తర్ర బెడుతురా/ ఖరీదైన కార్లల్ల ఊల్లెకొస్తురా’ అన్న కవిత చదువుతూ ఉన్నప్పుడు ఎవరికైనా భూముల గుమ్మి ’ధరణి’ గుర్తొస్తే అది అన్నవరం దేవేందర్ తప్పు కాదు. నా తప్పు అసలే కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News