Monday, November 18, 2024

లంకలో ఆగని హింసాకాండ

- Advertisement -
- Advertisement -

Non-stop violence in Sri Lanka

ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణల్లో 8 మంది మృతి
రాజపక్స పూర్వీకుల నివాసానికి నిప్పు
నేవీ బేస్‌లో తలదాచుకున్న మహింద రాజపక్స?
దేశవ్యాప్తంగా కర్ఫూ విధింపు
ఎయిర్‌పోర్టు మార్గంలో చెక్‌పాయింట్ ఏర్పాటు చేసిన నిరసనకారులు
ప్రతీకార దాడులకు తక్షణం స్వస్తి చెప్పాలని అధ్యక్షుడి పిలుపు
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కాల్చివేస్తామని రక్షణ శాఖ హెచ్చరిక

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో హింసాకాండ మంగళవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలకు తలొగ్గి ఎట్టకేలకు మహింద రాజపక్స తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. సోమవారం రాత్రిదేశవ్యాప్తంగా చెలరేగిన హింసాకాండలో రాజపక్స పూర్వీకుల నివాసంతో పాటుగా పలువురు మంత్రులు, ఎంపిల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళకారులపై రాజపక్స మద్దతుదారులుగా చెప్పబడుతున్న వారు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా, 250 మంది దాకా గాయపడ్డారు. హింసాకాండ దృష్టా దేశవ్యాప్తంగా కర్ఫూ విధించినప్పటికీ ప్రజల ఆగ్రహజ్వాలలు చల్లార లేదు.

దీంతో ప్రశాంతంగా ఉండాలని, పౌరులపై ప్రతీకార దాడులకు స్వస్తి చెప్పాలంటూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మంగళవారం ఒక ట్వీట్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏకాభిప్రాయ సాధన ద్వారా, రాజ్యాంగ పరిధిలో రాజకీయ సుస్థిరతను తిరిగి నెలకొల్పడానికి, ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆయన ఆ ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సిందిగా శ్రీలంక అటార్నీ జనరల్ పోలీసు చీఫ్‌ను ఆదేశించారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిని కాల్చి వేస్తామని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కాగా రాజపక్స కుటుంబ సభ్యులు దేశాన్ని వదిలి పారిపోకుండా చూడడానికి ప్రభుత వ్యతిరేక ఆందోళనకారులు కొలంబోలోని బండారనాయకె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేశారు.

నేవీ స్థావరంలో తలదాచుకున్న రాజపక్స?

మంగళవారం ఉదయం వేలాది మంది ఆందోళనకారులు ప్రధాని అధికార నివాసమైన టెంపుల్‌ట్రీస్ ఎదుట గుమికూడి భవనంలోకి చొరబడడానికి ప్రయత్నించారు. కొంత మంది బారికేడ్లను దాటుకుని భవనానికి అత్యంత దగ్గరగా వచ్చారు. కొందరు నిరసనకారులు భవనంలోకి పెట్రోల్ భాంబులు విసిరినట్లు అధికారులు చెప్పారు. కనీసం 10పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు చెప్పారు. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ సైన్యం మహింద, ఆయన కుటుంబ సభ్యులను ట్రింకోమలిలోని నేవీ స్థావరానికి తరలించారు. ఈ నేవీ స్థావరం కొలంబోకు 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆందోళనలు వెల్ల్లువెత్తాయి. మహింద, ఆయన కుటుంబ సభ్యులు నౌకాదళ స్థావరంలో ఉన్నట్లు సమాచారం తెలియగానే నిరసనకారులు బేస్ వద్దకు చేరుకుని ఆందోళనలు చేపట్టినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు మహింద కుమారుడు నమల్ కుటుంబం కొలంబో వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పు

సోమవారం దేశవ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు పలు చోట్ల మహింద కేబినెట్‌లోని పలువురు మంత్రులు, ఎంపిల నివాసాలకు నిప్పుబెట్టారు. హంబన్‌తోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిప్పంటించారు. అక్కడి రాజపక్స మ్యూజియంను ధ్వంసం చేశారు. కరునెగాలలోని మహింద రాజపక్స నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు ఓ ఎంపి సహా 8 మంది మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. నెగోంబోలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌పై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, లక్షలాది రూపాయలు విలువ చేసే పలు లగ్జరీ కార్లు పూర్తిగా ధ్వంసమైనాయి. ఇదిలా ఉండగా తక్షణం పార్లమెంటును సమావేశపరచాలని పార్లమెంటుస్పీకర్ మహింద యాప అబెయవర్దన మంగళవారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News