Thursday, January 23, 2025

మోడీజీ.. విభజన హామీలేమయ్యాయి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదని తెలంగాణ బుద్ధిజీవులు తెలిపారు. మరోమారు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ గత హామీలపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రకటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నా రు. ఈ మేరకు వారు బుధవారం ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల తరఫున కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రధానికి మరోమారు గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఏళ్లు పోరాటం చేశాం, ఇక్కడి ప్రజల కలలు నేరవేరుతాయని ఆశించాం. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా విభజన హామీలు నేరవేరలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ఎలాంటి కదలిక లేదు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఇతర రాష్ట్రాల్లో పె ట్టడం తెలంగాణపై చిన్నచూపు కాదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో ఏర్పా టు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీ ఊసేలేదని, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పారిశ్రామిక రాయితీలను కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని పేర్కొన్నారు.

విభజన చట్టం హామీలు నేరవేర్చకపోగా 8 ఏళ్ళలో తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారని విమర్శించారు. కొన్ని లక్షల మంది తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే సామర్థం ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 22 సాఫ్ట్‌వేర్ పార్కులను ప్రకటించి తెలంగాణకు మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోడి ప్రధాని అయ్యాక దేశఃలో 157 మెడికల్ కళాశాలలు, 16 ఐఐఎంలు, 87 నవోదయ పాఠశాలలు, 12 ఐసిఆర్, ట్రిపుల్ ఐటీలు ఇతర విద్యా సంస్థలు మంజూరు చేసినా ఒక్క విద్యాసంస్థను కూడా కేంద్రం తెలంగాణకు కేటాయించలేదని పేర్కొన్నారు. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, కులాలు, మతాలు, జాతులు ఇలా మొత్తంగా ప్రజల మధ్య విద్వేషాలు, అసహనం పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దళితులపై దాడులు జరుగుతున్నాయని, మైనారిటీలు అనుక్షణం భయభ్రాంతులకు గురవుతున్నారని, ప్రజల మత విశ్వాసాల పట్ల , ఆహారపు అలవాట్ల పట్ల వేష భాషల పట్ల ఏకపక్ష నిర్ణయాలు అమలు చేస్తూ నియంతృత్వ తరహాలో కేంద్ర పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాతలు కలలు గన్న లౌకిక దేశం మతోన్మాద రాజ్యంగా మారుతోందని, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయని, మీడియా, కేంద్ర దర్యాప్తు సంస్థలు, చివరికి సైనిక దళాలను కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకొవడాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. మోడి ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్క కూలే స్థితికి చేరిందన్నారు. కోట్లాది మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, కోవిడ్ నియంత్రణలో మోడి ప్రభుత్వ వైఫల్యం లక్షల ప్రాణాలు హరించిందని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతు మెడలపై మోటార్లకు మీటర్ల కత్తి వేలాడదీసి వ్యవసాయాన్ని అటు వ్యవసాయాన్ని, ఇటు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి కార్పోరేట్ మిత్రులకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల , తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఈ కింది సమస్యలను పరిష్కరించాలని బుద్దిజీవులు ప్రధానిని కోరారు. తెలంగాణ పర్యటనలో స్పష్టమైన వైఖరిని తెలుపాలన్నారు. ఈ సందర్భంగా వారు పలు ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తక్షణమే నేరవేర్చాలి, ఐటిఐఆర్‌ను పునరుద్దరించాలి, లేదా దానికి సమానమైన ఒక పథకాన్ని ప్యాకేజీని తెలంగాణకు ప్రకటించాలి, రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు కేటాయించాలి, మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాసంస్థలు, ఐఐఎం లాంటి విద్యాసంస్థలను కేటాయించాలి, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలి, తెలంగాణ రాష్ట్రం పట్ల కక్ష పూరిత, వివక్ష పూరిత పక్షపాత ధోరణిని విడనాడాలి, మతతత్వ ధోరణిని వీడి దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకునే విధంగా పాలన సాగాలని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని మేధావులు ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News