నాయకులు అనేవారు ఆదర్శంగా ఉండాలి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసమస్యలను పరిష్కరించాలి. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికారం లేనిదే మనుగడ లేనట్లు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులు తమ మాటలలో, ప్రసంగాలలో బూతులను తగ్గించాలి. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవ డానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. నాయకుల తీరు మారాలి. అధికా రం కోల్పోయినంత మాత్రాన మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా, తమ సహచరుల మానసిక స్థిరత్వం కోల్పోకుండా ఉదారంగా వ్యవహరించి తమ గొప్పతనాన్ని చాటాలి. ఎన్నికలలో ఎందుకు ఓడిపోయామనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకులు బూతులు మాట్లాడటమే రాజకీయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. లొట్టపీసు కేసులు, లొట్ట పీసు ముఖ్యమంత్రి, బజార్‌లో చూసుకుందాం రండి, రాష్ట్రాన్ని పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధ్దరిస్తారా! దొంగనే వేరే వాళ్ళను దొంగ అంటున్నారు. తాను జైలుకు పోయారు కాబట్టి తమను జైలుకు పంపాలని చూస్తున్నారు. వ్యక్తిగతంగా పేరుతో సంబోధిస్తూ వ్యక్తిగత నిందారోపణలు చేయడం నాయకులకు నిత్యకృత్యం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకులు మాట్లాడే పద్ధతిని, బహిరంగ సభలలో ప్రసంగించే పద్ధతులు మార్చుకోవాలి. ఎన్నికలు రాగానే గతంలో నాయకులు వారి వారి సిద్ధాంతాలు, ఆశయాలు, గెలిస్తే ప్రజలకు ఏం విధమైన అభివృద్ధి పనులు చేస్తారో తమ మాటల ద్వారా, బహిరంగ సభలలో ప్రసంగాల ద్వారా వివరించేవారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకొని చట్టసభలకు పంపితే నాయకులు తమ ప్రత్యర్థులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సన్యాసి, బొందపెడతం, తాటతీస్తా, పోరంబోకు వెధవలు, నరకుతం, చంపుతం, మేమెంటో తెలిసేలా చేస్తాం, బస్తీమే సవాల్, తలమాసినోడు, ఏసితొక్కుతా, హోంగార్డు, బ్రాండీ షాపులో పని చేయడానికి పనికిరాడు (రు).
బిర్యానీ, బీరు, ఐదు వందలకు ఓట్లు అమ్ముకుంటారని, ఐదు నిమిషాలు సమయం ఇస్తే ఒక వర్గం వారు పూర్తిగా లేకుండా చేస్తామని, బావమరిది అని ఇంకా ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోలేని, పత్రికల్లో రాయలేని భాషలో మాట్లాడటం ఆందోళనకరమైన విషయం. నాయకుల మాటల్లో, ప్రసంగాలలో ఉద్యోగస్థులను చులకన చేసి మాట్లాడటం, వ్యక్తిగత నిందారోపణలు చేయడం, తమ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. సిద్ధాంతాలు, ఆశయాలు, ఆదర్శాలు ఎప్పుడో గాలికి వదిలేశారు. ప్రజలకు ఉచితంగా అన్ని ఇస్తామని ఆశలు కలిగిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులు విలేకరుల సమావేశాలలో, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, ఊరేగింపులలో ఇంకా అనేక అభివృద్ధి, ఆందోళన కార్యక్రమాలలో వాడే భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో మాట్లాడుతున్నారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశం. మన ప్రజాస్వామ్య విధానాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నాయకులు అయినంత మాత్రాన ఏమి మాట్లాడినా నడుస్తుందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పోలీసులతో, అధికారులతో దురుసుగా మాట్లాడుతున్నారు. పోలీసులు నాయకుల మీద చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు. ధైర్యం చేసి కేసులను నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాలనుకుంటే తమ పలుకుబడిని ఉపయోగించి కేసులు నమోదు కాకుండా చూసుకుంటున్నారు. కేసులు నమోదు అయినా కోర్టుల ద్వారా బెయిల్ మంజూరు చేసుకుంటున్నారు. తర్వాత షరా మామూలే.
దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాజకీయ నాయకులే కాకుండా శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు వాడే భాష ఆందోళనకరమైన భాషగా ఉంటుంది. వ్యక్తిగత దూషణలు, ఒకరిపై ఒకరు అవాకులు, చవాకులు విసరడం, ఆరోపణలు చేసుకోవడం నిత్యకృత్య వ్యవహారంగా మారుతున్నది. ఏదైనా సరే సద్విమర్శ ఉండాలి. విమర్శలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. గత కొంతకాలంగా నాయకులు మాట్లాడే భాష, యాసలు బీభత్సకరంగా, భయోత్పాతంగా ఉంటున్నాయి. నాయకులు మాట్లాడే పద్ధతి ఈ విధంగా ఉంటే వారి అనుచరులు ఇంకా రెచ్చిపోతున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా నాయకులు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇండ్ల మీద దాడులు చేయడం, భౌతిక దాడులకు పాల్పడటం ఆందోళనకరమైన విషయం. నాయకుల మీద ఏమైన ఆరోపణలు చేయాలంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, కోర్టులు ఉన్నాయి. తమ ప్రత్యర్థులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలి. కాని కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ భౌతిక దాడులు చేయడం, ఇండ్ల మీదికి వెళ్ళడం ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి పద్ధతి కాదు. నాయకులు అనేవారు ఆదర్శంగా ఉండాలి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసమస్యలను పరిష్కరించాలి. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికారం లేనిదే మనుగడ లేనట్లు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులు తమ మాటలలో, ప్రసంగాలలో బూతులను తగ్గించాలి.
ప్రపంచంలోనే అతి పెద్దదైన మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. నాయకుల తీరు మారాలి. అధికారం కోల్పోయినంత మాత్రాన మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా, తమ సహచరుల మానసిక స్థిరత్వం కోల్పోకుండా ఉదారంగా వ్యవహరించి తమ గొప్పతనాన్ని చాటాలి. ఎన్నికలలో ఎందుకు ఓడిపోయామనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాని కొంతమంది నాయకులు ప్రజలే ఏదో తప్పు చేశారని, ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని, ప్రజలకు ముందు ముందు తెలుస్తుందని నాయకుల ఓటమిని ప్రజలపై భారం వేస్తున్నారు. తమ తప్పులను తెలుసుకోకుండా, తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరును బేరీజు వేసుకోకుండా, ప్రజలకు తాము ఎందుకు దూరమైనామనే ఆత్మవిమర్శ చేసుకోకపోవడం ఆందోళనకరమైన విషయం.
నాయకులు ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఇటీవల దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. ఉద్యోగులను అధికార పార్టీ తొత్తులు అనడం, ఉద్యోగులపై దాడులు చేయడం, ఉద్యోగులతో మాట్లాడే పద్ధతి దురుసుగా ఉంటుంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రధానోపాధ్యాయులపై దాడి చేయడం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు తుక్కుగూడ ప్రధానోపాధ్యాయులపై దాడిని ఖండిస్తూ ప్రకటనలు చేయడం, నిరసనలు వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులు అసలు ఓటర్లే కాదు అన్నట్లు మాటల తీరు, చేష్టల తీరు ఉంటున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు ఉద్యోగ, ఉపాధ్యాయులతో వ్యతిరేకంగా ప్రవర్తించిన తీరును ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపిస్తున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయులతో సన్నిహితంగా ఉండేవారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం, వారు లేవనెత్తిన సమస్యలు పరిష్కారం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులే ప్రభుత్వం అనే భావన కలిగించేవారు. ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పట్టించుకోకపోవడం ఆవేదన కలిగించే విషయం.
డిఎలు పెండింగ్‌లో ఉన్న, పిఆర్‌సి గడువు ముగిసిన, పదవీ విరమణ చేసిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కమ్యూటేషన్, గ్రాట్యుటీ, జిపిఎఫ్ అమౌంట్, తెలంగాణ స్టేట్ జిపిఎఫ్ అమౌంట్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, ఎన్‌క్యాష్‌మెంట్ రూపాయలు రాకున్నా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ జీతాలను ఆపివేసి రైతులకు రైతుబంధు ఇవ్వాలని అనడం విచిత్రం. అధికారంలో ఉన్నప్పుడు దేన్నీ పట్టించుకోని నాయకులు అధికారం కోల్పోగానే రైతులపై, గురుకుల పాఠశాలల అద్దెలపై, నిరుద్యోగ సమస్యలపై, ఉద్యోగ అవకాశాలపై మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో నాయకులు ఏమి చేసినా అడిగే నాథుడే ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి సాధించింది. మీరు మాట్లాడే ప్రతి మాట సామాన్య ప్రజల దగ్గరకు సైతం వెళ్తుంది. నాయకులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అనేక మంది యువకులు, అనేక మంది అభిమాన సంఘాల నాయకులు తమ నాయకులు మాట్లాడే మాటలను శ్రద్ధగా వినడం, వీలైతే నాయకులు మాట్లాడే మాటలను అనుసరించడం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడే మాటలను ఆదర్శనీయంగా, ఆచరణాత్మకంగా ఉండేటట్లు చూసుకోవాలని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కోరుకుంటున్నారు.
ఎస్ విజయ భాస్కర్
9290826988