అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌విసి-ఎఫ్‌ఈఈ బ్యానర్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా… క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ అవసరాల శ్రీనివాస్ పర్ఫెక్షనిస్ట్. ఈ సినిమా కోసం ఐదారు నెలల పాటు ఆయన గుండుతోనే ఉన్నారు. డైరెక్టర్ రాచకొండ విద్యాసాగర్ చాలా ఫ్యాషన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు.
101 జిల్లాల అందగాడుతో అవసరాల శ్రీనివాస్, నవరసాల శ్రీనివాస్‌గా పేరు తెచ్చుకుంటాడు అని తెలిపాడు. హీరో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఐడియా వచ్చినప్పుడు ఇది నా ఆలోచన అనుకుంటే, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో ఇది అందరి కథగా మారింది. ఈ సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అందరిని నవ్వించే ఈ సినిమా సెప్టెంబర్ 3న సినిమా విడుదలకానుంది. డైరెక్టర్ రాచకొండ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ కథ ఎంతో మందిని కదిలిస్తుంది. సినిమా చూసిన ప్రతిసారి కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అంత గొప్ప ఎమోషన్స్ సినిమాలో ఉన్నాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రుహానీ శర్మ, మహేశ్, కిరణ్ గంటి, శక్తికాంత్ కార్తీక్, ప్రదీప్, రామ్ తదితరులు పాల్గొన్నారు.