Sunday, December 22, 2024

లోక్‌సభలో దక్షిణాది సీట్లకు గండి?

- Advertisement -
- Advertisement -

దేశంలో చివరిసారిగా 1971వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 1977వ సంవత్సరం నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1976వ సంవత్సరంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 2021 జనగణన వరకు లోక్‌సభ స్థానాలను పెంచకుండా చట్టంచేశారు. అందుకు ప్రధాన కారణం దేశంలో జనాభా నియంత్రణను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని, జనాభా నియంత్రణను అన్ని రాష్ట్రాలు పాటించాలన్న ఉద్దేశంతో అనాడు ఇందిరా గాంధీ సర్కార్ చట్టం చేశారు. కానీ అప్పుడు ఏ కారణం చేతైతే జనాభా నియంత్రణను పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోవొద్దన్న భావనతో చట్టం తీసుకురాగా, ఇప్పుడు అదే చట్టం జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసి విజయం సాధించిన రాష్ట్రాల పాలిట శాపం కానుందని జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన చేసే విధానాన్ని చూస్తే అర్థమవుతుంది.

2002 సం.లో ఆటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తరువాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. పునర్విభజన ద్వారా అనుసరించే విధానాల వల్ల కేంద్రం సూచనల మేరకు కుటుంబ నియంత్రణ ద్వారా జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లనుంది. జనాభా తక్కువగా ఉండడం మూలాన లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భారీగా కోతపడనుంది.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల జనాభా తక్కువ. లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనకు అనుసరించే ఈ జనాభా లెక్కల ప్రామాణికంతో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ఉన్న 543 మొత్తం స్థానాల్లో 23.74 శాతం అంటే 129 స్థానాల ప్రాతినిధ్యం ఉండగా, కేంద్రం అనుసరించే పునర్విభజన వల్ల ఆ రాష్ట్రాల ప్రాతినిధ్యం 6.26 శాతం తగ్గిపోయి 129 స్థానాల నుండి 103 స్థానాలకు పడిపోనుంది.

కానీ ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెరుగుదలలో పెద్దన్న పాత్ర పోషించిన ఉత్తరాది రాష్ట్రాలకే వరంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విధానాలు ఉండడం గమనార్హం. అంటే 2026లో పునర్విభజన విధానాల ద్వారా జనాభా నియంత్రణలో దక్షిణ రాష్ట్రాల సాఫల్యత వాటి రాజకీయ ప్రాతినిధ్యానికే ఎసరు పెడుతుంది. లోక్‌సభలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని ఒకేసారి పరిశీలిస్తే.. ప్రస్తుత సీట్లు 543 లో ఉత్తరాది రాష్ట్రాలైన యుపి 80 సీట్లు, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, మధ్యప్రదేశ్ 29 సీట్లను కలిగి ఉండగా, దక్షిణాది రాష్ట్రాలు ఎపి, తెలంగాణ 42 సీట్లు, కర్ణాటక 28 సీట్లు, కేరళ 20 సీట్లు, తమిళనాడు 39 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. పునర్విభజన కోసం రెండు ప్రతిపాదనలను ఆలోచిస్తున్న కేంద్రం మొదటగా జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ స్థానాలను 848కి పెంచి దేశ జనాభాతో భాగించగా వచ్చేది దేశ పార్లమెంట్ స్థానం సగటు జనాభా, ఈ సగటు పార్లమెంటు జనాభా సంఖ్యతో రాష్ట్ర జనాభాను భాగిస్తే ఆ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాల సంఖ్య వస్తుంది.

ఈ విధంగా చూస్తే మన దక్షిణాది రాష్ట్రాల స్థానం పార్లమెంటులో స్థానాలు 130 నుండి 165కు కొద్ది మేర పెరిగిన నిష్పత్తి ప్రకారం చూస్తే దారుణంగా 23 శాతం నుండి 19 శాతానికి పడిపోనుంది.. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే.. లోక్‌సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 545కే పరిమితం చేసి చేపట్టబోయే జనాభా లెక్కల ప్రకారం పునర్విభజించటం. ఇలా చేసినా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఈ విధానంలో దేశ జనాభాను 545తో భాగిస్తారు. అప్పుడు జనాభా అధికంగా పెరిగిన రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు కూడా పెరుగుతాయి. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తగ్గిపోతాయి. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 14కు పడిపోతాయి. అంటే మూడు స్థానాలు ఎగిరిపోతాయి. రెండింటిలో ఏ విధానంలో నియోజక వర్గాలను పునర్విభజించినా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలే.. అంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుందో అర్థం చేసుకోచ్చు.

దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ లో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకొనున్నాయి. ఈ లెక్కన చూస్తే పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్షగా లోక్‌సభ ప్రాతినిధ్యానికి, రాజకీయ ప్రాధాన్యానికీ కోతపడబోతుందన్నమాట. దాని వల్ల హక్కుగా రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా, అనుకూలమైన విధానాల రూపకల్పన చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయగల శక్తి దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతుంది. పర్యవసానంగా ఉత్తర – దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలకు పెచ్చరిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తమై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసమానతలు లేకుండా లోక్‌సభ స్థానాలను పునర్విభజన చేసే విధంగా ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలతో స్థూలమైన ఏకాభిప్రాయాన్ని సాధించి తమ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవాలి.

పిన్నింటి విజయ్ కుమార్

9052039109

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News