సియోల్ : ఉత్తర కొరియా బుధవారం ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. ఇంత దగ్గరగా ఉత్తర కొరియా క్షిపణులు పడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఉల్లెంగ్డో ద్వీపంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అమెరికా విజిలెంట్ స్ట్రామ్ పేరిట యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి. వీటిలో 240 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది. తమపై దండయాత్ర జరపాలనే దురుద్దేశం తోనే అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలకు పాల్పడుతున్నాయని , దీనికి తమ వైపు నుంచి శక్తి మంతమైన ప్రతి చర్యలు ఉత్తర కొరియా విదేశాంగశాఖ మంగళవారం హెచ్చరించింది. ఆ ప్రతిచర్యలు ఏమిటో వివరించకపోయినా , అణ్వాయుధ పరీక్షను మరికొన్ని వారాల్లో నిర్వహించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ కొరియా సైన్యం ఏటా నిర్వహించే 12 రోజుల అభ్యాసాలను ఇటీవలే ముగించింది. అందులో అమెరికన్ సైనికులూ పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. అనంతరం ఉభయ దేశాల యుద్ధ విమానాల విన్యాసాలు ఆరంభమయ్యాయి. వచ్చే శుక్రవారం వరకు ఇవి కొనసాగుతాయి.