సియోల్ : ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దాడి ప్రారంభించిన నాలుగేళ్ల తరువాత మళ్లీ అత్యంత శక్తివంతమైన క్షిపణి దాడులకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ సిద్ధమవుతున్నారని ఉత్తరకొరియా సోమవారం వెల్లడించింది. త్వరలో అణ్వాయుధ ప్రయోగాలు, లేదా పరీక్షలు చేయడానికి, తన ఆయుధాగారాన్ని ఆధునికీకరణ చేయడానికి ఉత్తర కొరియా సిద్ధమౌతున్నట్టు ఈ ప్రకటన సూచిస్తోంది. తద్వారా అణుదౌత్య చర్చలను ఆపేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవాలన్నదే ఉత్తర కొరియా లక్షంగా కనిపిస్తోంది. గత గురువారం ఉత్తర కొరియా ఈ ఏడాది 12 వ ఆయుధ పరీక్షలను నిర్వహించింది.
కొత్తగా అభివృద్ధి చేసిన సుదూర లక్ష సాధన హ్వాసాంగ్ 17 క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించింది. ఈ క్షిపణి కొరియా ద్వీపం, జపాన్ మధ్య సముద్ర జలాల్లో దిగేముందు 6428 కిలోమీటర్ల (3880 మైళ్ల ) ఎత్తులో 1,090 కిలోమీటర్ల (680 మైళ్ల దూరం 67 నిముషాల్లో ప్రయాణించిందని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ క్షిపణిని ప్రయోగిస్తే నిటారుగా కన్నా చదునుగా 15,000 కిమీ ( 9320 మైళ్లు ) దూరం ప్రయాణించగలదని, అమెరికా ప్రధాన భూభాగం దాటి వెళ్ల గలదని నిపుణులు చెబుతున్నారు. ఇదివరకు ధ్వంసం చేసిన భూగర్భ అణుపరీక్ష క్షేత్రాలను, సొరంగాలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఉత్తర కొరియా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు చేపట్టడం అంతర్జాతీయ భద్రతకు తీవ్రమైన హెచ్చరిక అని, అలాంటి ప్రయత్నాలను ఉత్తర కొరియా ఆపివేసి చర్చలకు సిద్ధం కావాలని సియోల్ ఏకీకరణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లీ జోంగ్ జూ సూచించారు.