ప్యోంగ్యాంగ్ : అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఉత్తర కొరియా మొట్టమొదటిసారి బుధవారం ఉదయం ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. చియోల్లిమా రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రయోగం విఫలం కావడంతో ఆ శకలాలు తమ మీద పడతాయని దక్షిణ కొరియా భయాందోళనలు చెందింది. ఈ ప్రయోగం విఫలమైందని ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది.
ఉపగ్రహాన్ని తీసుకువెళ్తున్న రాకెట్ తొలి, రెండో దశల సమయంలో థ్రస్ట్‌ను కోల్పోయినట్టు పేర్కొంది. ఈ శకలాలు కొరియా ద్వీపకల్పం లోని ఉత్తరం వైపు సముద్ర జలాల్లో పడినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. ఉత్తర కొరియా లోని ఈశాన్య ప్రాంతం లోని తాంగ్‌ఛాంగ్ రీ లోని ప్రధాన అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం 6.29 గంటల సమయంలో దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ రాకెట్ కూలిపోయేటప్పుడు అసాధారణ గమనంలో ప్రయాణించడంతో అమెరికాతో సమన్వయం పెంపొందించుకున్నామని దక్షిణ కొరియా తెలిపింది. కొన్ని శిధిలాలను దక్షిణ కొరియా స్వాధీనం చేసుకుంది.
దీనిపై జపాన్ స్పందిస్తూ ఏ వస్తువు కూడా అంతరిక్ష కక్ష లోకి చేరుకోలేదని వెల్లడించింది. రాకెట్ ప్రయోగించారన్న విషయం తెలియగానే దక్షిణ కొరియా, జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలను భవనాలు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాలని హెచ్చరించారు. జపాన్ ఒకినావాలో క్షిపణి హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేసింది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు వ్యతిరేకంగా బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని ఉపయోగించడమే అని పేర్కొంది.