Monday, November 18, 2024

డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలపై నార్త్ టెక్సాస్ యూనివర్శిటీ సహకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలపై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులకు సహకారం అందించేందుకు యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాఫెసర్ కామేశ్ సంసిద్దతను వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి. రవీందర్ పర్యటన సందర్భంగా అమెరికాలోని డెల్లాస్‌లో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. డోన్ టెక్నాలజీపై ప్రొఫెసర్ కామేశ్ విస్తృత పరిశోధనలు చేశారు అడోబ్ సిఇఓ శంతను నారాయణ్ సహధ్యాయిగా ఉస్మానియాలో తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. సివిల్, రక్షణ రంగాల్లో ఎలక్ట్రానిక్, రోబోటిక్స్, డ్రోన్ అప్లికేషన్ల పాత్ర కీలకమైందని, ఆయా రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయ నన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నిత్యావసరాలు, మందుల పంపిణీ చేయడానికి భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం డ్రోన్ టెక్నాలజీ వినియోగించేందుకు ప్రయత్నిస్తోందని, ప్రొఫెసర్ రవీందర్ వివరించారు.

డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలపై ఉస్మానియా యూనివర్శిటీతో కలిసి పనిచేసేందుకు యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ ముందుకు రావటం ఆనందంగా ఉ ందన్నారు. విస్తృతమైన పూర్వ విద్యార్థుల సమూహం ఉస్మానియా సొంతమని యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ చాన్సలర్ ప్రొఫెసర్ రేణు ఖటోర్ అన్నారు. పోలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె పూర్వ విద్యార్థుల సహకారంతో ఉస్మానియాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్న ప్రొఫెసర్ రవీందర్‌ను అభినందించారు. అనతి కాలంలోనే ఉస్మానియా అత్యుత్తమ విద్యా కేంద్రం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ లోని విదేశీ సంబంధాల విభాగంతో అనుసంధానమై పనిచేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఎంగేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మైఖేల్ పెల్లేటియర్ ముందుకు వచ్చారు. ఫలితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థుల బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

హైదరాబాద్ ఉస్మానియా క్యాంపస్‌లో విద్యాబుద్దులు నేర్చుకొని టెక్సాస్, డల్లాస్‌లోని పలు కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న దిశానిర్దేశం చేస్తున్న ఉస్మానియన్లు ఈ సమావేశాల ద్వారా ఒక్కచోటికి చేరారు. క్యాంపస్‌లో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా యూనివర్శిటి విసి ప్రొఫెసర్ డి రవీందర్ ను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల మేధస్సు, విజ్ఞానాన్ని ఉస్మానియా విద్యార్థులకు పంచాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ రవీందర్ పిలుపునిచ్చారు. ఉప కులపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను తీసుకుంటున్న చర్యలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తాత్కాలిక, దీర్ఘకాలిక కార్యాచరణను వారితో పంచుకున్నారు. తాము ఉన్నత స్థితికి చేరేందుకు కారణమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి తాము సిద్దంగా ఉన్నామని అక్కడి పూర్వ విద్యార్థులు విసికి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉస్మానియా పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News