Friday, November 22, 2024

రూ. 3లక్షలు ఇచ్చుకో… బిటెక్ సర్టిఫికెట్ పుచ్చుకో…

- Advertisement -
- Advertisement -

North Zone Task Force police arrested two gang selling fake certificates

 

హైదరాబాద్ : నకిలీ సర్టిఫికేట్లు విక్రయిస్తున్న రెండు ముఠాలను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. రెండు ముఠాలకు చెందిన పదిమంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 48 సర్టిఫికేట్స్, కంప్యూటర్, 34 రబ్బర్ స్టాంప్‌లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కన్సల్టెన్సీ నిర్వాహకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, సర్టిఫికేట్లు కొనుగోలు చేసిన విద్యార్థులు ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం….సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, రామక్కపేట గ్రామానికి చెందిన గుంటి మహేశ్వర్ రావు నగరంలోని రాజేంద్రనగర్‌లో ఉంటూ ప్రైడ్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మధ్యప్రదేశ్, భోపాల్ జిల్లా, బుందేలా భవన్‌కు చెందిన కేతన్ సింగ్ ఎస్‌ఆర్‌కె యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్త్తున్నాడు. పదోతరగతి వరకు చదువుకున్న మహేశ్వర్ రావు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రాసెస్ గురించి పూర్తి అవగాహన ఉంది.

ఈక్రమంలో మహేశ్వరరావు 2010లో కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో ప్రైడ్‌కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి స్థానిక కాలేజీలు, మిగతా రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఇప్పించేవాడు. తర్వాత కన్సల్టెన్సీని మెహిదీపట్నం, పిల్లర్ నంబర్ 21కి మార్చాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని పథకం రచించాడు. ఇదివరకే తనకు సర్వేపల్లి రాధాక్రిష్ణ యూనివర్సీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్‌తో పరిచయం ఉండడంతో నగరంలో నకిలీ సర్టిఫికేట్ల దందాకు తెరతీశాడు. బిటెక్, డిగ్రీ సర్టిఫికెట్స్ అవసరం ఉన్న విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పరీక్షలు, అటెండెన్స్ లేకుండా సర్టిఫికేట్లను విక్రయిస్తూ వచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద యూనివర్సిటీ, గ్లోకర్ యూనివర్సిటీ షారాన్‌పూర్, ఉత్తరప్రదేశ్ నుంచి బి టెక్, బిఎస్సీ, బి. కాం, హోటల్ మెనేజ్‌మెంట్, ఎంబిఏ, బిసిఎ, ఎఎల్‌బి, బిఎ, పిజిడిఎసిఏ కోర్సుల సర్టిఫికేట్లను తీసుకుని వచ్చి విక్రమించేవాడు.

ఈ విషయం తెలియడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆసిఫ్‌నగర్ పోలీసులు కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. మరో కేసులో నకిలీ సర్టిఫికేట్లను జారీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా, బుందేలా భవన్‌కు చెందిన కేతన్ సింగ్ ఎస్‌ఆర్‌కె యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంచ శ్రీకాంత్ రెడ్డి నగరంలోని మలక్‌పేట,దిల్‌సుక్‌నగర్‌లో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. కేతన్ సింగ్ సాయంతో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నకిలీ సర్టిఫెకేట్లను విక్రయించారు. బి. కాం,బిఎ డిగ్రీలకు రూ.1.5లక్షలు, బి ఎస్సీకి రూ.1.75లక్షలు, బి.టెక్‌కు రూ.3,00,000, ఎంబిఎ, ఎంఎ డిగ్రీలకు రూ.2.5లక్షలు తీసుకుని నకిలీ సర్టిఫికేట్లను జారీ చేశారు.

దీనికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కిషన్ సింగ్ రెండు ముఠాలకు చెందిన వారికి సహకరిస్తున్నారు. మద్రాస్ యూనివర్సిటీ, కామరాజ్ యూనివర్సిటీకి చెందిన 170 సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికేట్లను కొనుగోలు చేసిన ఖైరతాబాద్‌కు చెందిన దుంపల్లి శశాంక్, అలుక నిషాంత్ రెడ్డి, కొడాలి సాయికృష్ణ, వెల్‌టూర్ వినయ్ కుమార్ రెడ్డి, బద్దం అనురాగ్ రెడ్డి, సిరిగిరి యుగంధర్ రెడ్డి, మహ్మద్ అల్తాశాముద్దిన్‌ను అరెస్టు చేశారు. ఈ సమాచారం తెలియడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆటకట్టించడంలో టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ నేతృత్వంలో ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు తదితరులు శ్రమించారు. ఈక్రమంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా పట్టివేతలో ప్రతిభ చూపిన పోలీసులను సిపి సివి ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.

ఫేయిల్ అయిన విద్యార్థులే టార్గెట్….

ఫేయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి సర్టిఫికేట్లను ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. దీని కోసం ఫోన్ నంబర్లు తెలుసుకుని టెలీ కాలర్లతో ఫోన్లు చేపించి నకిలీ సర్టిఫికేట్లను ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని ఇస్తున్నారు. విద్యార్థులను మధ్యప్రదేశ్‌కు తీసుకుని వెళ్లి నకిలీ పరీక్షలు నిర్వహించి వారిని నమ్మిస్తున్నారు. పరీక్షలు రాశామని సర్టిఫికేట్లు వస్తాయని విద్యార్థులు వాటిని తీసుకుని వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు.

రిక్రూటర్స్ ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలిః లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్

ఉద్యోగాలు ఇచ్చేవారు ఉద్యోగం కోసం సర్టిఫికేట్లను సమర్పించినప్పుడు వాటిని ఆన్‌లైన్‌లో చూసుకోవాలని,దీంతో అది నకిలీదా కాదా అనేది తెలిసి పోతుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నతవిద్యామండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. డబ్బులు తీసుకుని సర్టిఫికేట్లను కొనుగోలు చేయవద్దని కోరారు. ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లోని స్టూడెంట్ అకడమిక్ డాటా సర్వీస్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. దాని ద్వారా నకిలీ సర్టిఫికేట్లను త్వరగా గుర్తించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు కూడా నకిలీ సర్టిఫికేట్లను ప్రోత్సహించవద్దని అన్నారు. యూజిసి వెబ్‌సైట్ ద్వారా గుర్తింపు ఉన్న యూనివర్సిటీల గురించి తెలుసుకుని కోర్సుల్లో చేరాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News