తెలంగాణలో తెలిక పాటి వర్షాలు
నవంబర్ రెండో వారం నుంచి పెరగనున్న చలి తీవ్రత
వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఇవి శనివారం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీర ప్రాంతాలైన పుదుచ్చేరి ,కరైకాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి రుతుపనాలు ప్రవేశించినట్టు ప్రకటించింది. బంగాళాఖాతం ,దక్షిణ ద్వీపకల్పం మీద దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో ఉన్న ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు తెలిపింది. శనివారం కింది స్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య ,తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తున్నాయని వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలైనట్టు తెలిపింది. తమిళనాడు , ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ప్రాంతాల్లో వార్షిక వర్షపాతం ఎక్కువగా ఈశాన్యరుతుపవనాల ద్వారానే నమోదవుతుంది. ఈ రుతుపవనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కొనసాగే అవకాశం ఉంది.
తగ్గిన చలి:
తెలంగాణ అంతటా గత నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నవంబర్ రెండోవారం నుంచి తిరిగి చలి తీత్రవ పెరగనుందని తెలిపింది. తెలంగాణలో రాగల రెండురోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సోమవారం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది.