న్యూఢిల్లీ : దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో వచ్చే రెండు మూడురోజులలో మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండి) ఆదివారం ఈ మేరకు తాజా వాతావరణ హెచ్చరికలు వెలువరించింది. అసోం, మేఘలాయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో ఈ నెల 30, 31 తేదీలలో తీవ్రస్థాయి తేమ వాతావరణం నెలకొందని తెలిపారు. బంగళాఖాతం నుంచి వీస్తున్న బలీయ దిగువ స్థాయి నైరుతి గాలుల ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ స్థాయి విస్తృత వర్షాలు ఈదురుగాలులతో పాటు పడుతాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులు పరిణామాలు ఉంటాయి. ఈ పరిస్థితి ఎప్రిల్ రెండు వరకూ ఉంటుంది.
దీని గరిష్ట స్థాయి ప్రభావం మంగళ, బుధవారాలలో కనబడుతుందని హెచ్చరికలలో తెలిపి, ఈ మేరకు ఈ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ సంకేతం వెలువరించారు. దక్షిణ అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ప్రాంతాలలో ఈ దశలో కొండచరియలు విరిగిపడటం తద్వారా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటి పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు. భారీ వర్షాలకు కూడా అవకాశం ఉన్నందున రాదార్లపై వాహనాల రాకపోకలకు వీక్షణ సమస్య ఏర్పడుతుంది. పలు రోడ్లపై వరద నీరు వచ్చిచేరడంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడటం, ప్రయాణ జాప్యం వంటి పరిణామాలు ఉంటాయని తెలిపింది.