Sunday, December 22, 2024

ఆపరేషన్ టెర్రరిస్టు

- Advertisement -
- Advertisement -

బారాముల్లా (జెకె) : పాకిస్థాన్ సైనికులు ఇటీవల కరడుగట్టిన ఉగ్రవాదులను నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంబడి సరిహద్దులు దాటించే దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సరిహద్దుల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జమ్మూ కశ్మీర్ భూభాగంలోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు వీలుగా పాక్ జవాన్లు భీకర కాల్పులకు దిగారు.ఈ దశలో మన భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు టెర్రరిస్టులను తాము శనివారం మట్టుపెట్టినట్లు భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత జవాన్లు నిరంతరం తమ గాలింపు చర్యలను ఉధృతం చేశారు. మరో వైపు భారతదేశంలోకి టెర్రరిస్టులను జొప్పించేందుకు, విధ్వంసకర చర్యలకు పాల్పడేందుకు, భారతీయ సైన్యంపై దాడులకు పాక్ సైన్యం విశ్వ ప్రయత్నం చేస్తోంది. శనివారం తాము ముగ్గురు టెర్రరిస్టులను కాల్చివేసినట్లు , వీరిలో ఇద్దరి భౌతికకాయాలను కనుగొన్నట్లు తెలిపిన సైన్యం , మరో శవాన్ని స్వాధీనపర్చేందుకు యత్నిస్తుండగా పాక్ సైన్యం నుంచి కాల్పులు జరిపింది.

దీనితో తాత్కాలికంగా వెలికితీత , గాలింపు చర్యలను నిలిపివేశారు. పాకిస్థానీ ఉగ్రవాదులపై చేపట్టిన ఆపరేషన్ , ఇప్పటి కాల్పుల గురించి పీర్ పంజాల్ దళం బ్రిగేడియర్ పిఎంఎస్ థిల్లాన్ విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలోకి పాక్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబాట్ల ద్వారా ప్రవేశిస్తున్నట్లు తమకు నిర్థిష్ట ఇంటలిజెన్స్ సమాచారం అందిందని వివరించారు. దీనితో భారతీయ సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసు బలగాలతో కలిసి సంయుక్త నివారణ చర్యను చేపట్టినట్లు థిల్లాన్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు నిఘాను మరింత విస్తృతపర్చారు. ఉగ్రవాదులను మట్టుపెట్టిన ప్రాంతంలో రెండు ఎకె రైఫిళ్లు, ఒక పిస్టల్, ఏడు నాటు బాంబులు , ఒక ఐఇడి కనుగొన్నట్లు, ఉగ్రవాదుల వద్ద పాకిస్థానీ కరెన్సీ నోట్లను కనుగొన్నట్లు తెలిపారు. సరిహద్దులలో స్థిరమైన రీతిలో శాంతి స్థాపనకు వీలుగా పలు దఫాల చర్చల తరువాత భారత్ పాక్ సైనిక వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశలో 2021 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. అయితే ఈ విరామ దశలో పాకిస్థాన్ వైపు నుంచి ఇటీవలి కాలంలో చొరబాట్లు ఎక్కువ అవుతున్నట్లు భారత సైన్యానికి సమాచారం అందింది.

కాగా అనంత్‌నాగ్ జిల్లాలో విస్తరించుకుని ఉన్న దట్టమైన అడవుల్లో పాక్ ఉగ్రవాదులు తిష్టవేసుకుని ఉన్నట్లు సమాచారం అందింది. దీనితో వీరిని ఏరివేసేందుకు జరిపిన గాలింపు చర్యలలో భాగంగా సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్ ఇప్పుడు శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారతదేశానికి చెందిన నలుగురు భద్రతా సిబ్బంది వారు ఉగ్రవాదుల కాల్పుల్లో బలి అయ్యారు. దీనితో భారతీయ సైన్యం మరింత ఉధృత రీతిలో ఇప్పుడు ఉగ్రవాదుల నిర్మూలన చర్యలకు దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News