Thursday, January 23, 2025

విశిష్ట చంద్రయాన్.. స్మరణీయ విశేషాలు

- Advertisement -
- Advertisement -

లఖీంపూర్ (అసోం) : శుక్రవారం విజయవంతం అయిన చంద్రయాన్ 3కు అసోం నేల తల్లి బిడ్డకు బంధం ఉంది. ఉత్తర అసోంలోని లఖీంపూర్ పట్టణం ఈ ప్రయోగం ఘట్టాన్ని ఆసక్తితో తిలకించింది. దేశ మూడవ చంద్ర మండల యాత్రలో ఈ ప్రాంతపు ఛాయన్ దత్తా కూడా భాగం అయ్యారు. తేజ్‌పూర్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీర్ పట్టభద్రుడు. ఇప్పుడు ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో సైంటిస్టు/ఇంజనీరుగా ఉన్నారు. చంద్రయాన్ 3లో భాగంగా ఈ యాత్రకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్నారు. తమ కుమారుడు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తండ్రి రంజిత్ దత్తా తన నివాసంలో కొందరు స్నేహితులు,

బంధువులతో కలిసి చంద్రయాన్ ప్రయోగాన్ని టీవీల్లో తిలకించారు, సీనియర్ దత్తా తమ ఊర్లో టీ కప్పులు , ప్రెషర్ కుక్కలు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. తన కొడుకు ఈ అంతరిక్ష యాత్రలో భాగం కావడం తనకు ఆనందం కల్గించిందని చెప్పారు. తల్లి ఆనందభాష్పాలు రాల్చారు. తమకు ఇది చిరస్మరణీయ రోజు అని తల్లిదండ్రులు తెలిపారు. జనవరిలో ఛాయన్ ఇక్కడికి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది వెళ్లారు. బెంగళూరులో ఇంజినీర్‌గా బాధ్యతలో ఉన్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ చంద్రయాన్ 3 విజయవంతం కోసం పాటుపడుతూ వచ్చారు .

ఎపి, తమిళనాడు, కర్నాటకల నుంచి పదివేల మంది
శ్రీహరికోట నుంచి ప్రయోగం తిలకించడానికి శుక్రవారం ఉదయం నుంచే దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది షార్ వద్దకు చేరారు. వీరిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలకు చెందిన వారు ఉన్నారు. పదివేల మంది వరకూ ఇక్కడికి వచ్చినట్లు అంచనా, ప్రయోగం తిలకించడానికి వీరికి ఇస్రో అధికారులు అనుమతించారు. ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు అయింది. తాను ఈ ప్రయోగం చూడటానికి వచ్చినట్లు తిరుపతికి చెందిన సందీప్ అనే కాలేజీ విద్యార్థి తెలిపారు. ప్రయోగం తనకు ఉత్తేజం కల్గించిందని ఈ యువకుడు చెప్పారు. పలు రకాల వృత్తుల్లో ఉన్న వారు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రయోగం విజయం చెందడంతో కేరింతలు వ్యక్త చేశారు.
మన స్ఫూర్తి మరింత ఎత్తుకు
మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్
ఇప్పటి ప్రయోగం కేవలం రాకెట్ దూసుకువెళ్లడమే కాదు, భారతీయ కీర్తివంతపు స్ఫూర్తిని సమున్నత శిఖరాలకు తీసుకువెళ్లిన అత్యద్భుత ఆవిష్కరణం అని పలు పరిశ్రమల సముదాయాల మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.

చంద్రయాన్ తమిళ బంధం
ఇప్పటి చంద్రయాన్ 3 విజయవంతపు ప్రక్రియలో తమిళనాడు వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉంది. విల్లుపురంలో జన్మించిన పి వీరముత్తువేల్ చంద్రయాన్ 3 ప్రాజెక్టు పర్యవేక్షకులుగా ఉన్నారు. సైంటిస్టు అయిన వీరముత్తువేల్ విల్లుపురం జిల్లాకు చెందిన ఓ కుటుంబ వ్యక్తి. ఇంతకు ముందు తమిళనాడుకే చెందిన వనిత చంద్రయాన్ 2 దశలో అప్పటి ఇస్రో కె శివన్ సారధ్యంలో పర్యవేక్షకురాలుగా ఉన్నారు. ఇస్రో చరిత్రలో ఆమె తొలి మహిళా ప్రాజెక్టు సంచాలకులుగా రికార్డుల్లోకి చేరారు. భారతదేశ ప్రతిష్టాత్మక రాకెటు ప్రయోగాలకు ఆద్యులైన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం కూడా తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతం వారే.

లక్నో రాకెట్ రీతూ ఇస్రో లీడర్
ఇప్పటి చంద్రయాన్ 3 ప్రయోగంలో పాలుపంచుకున్న వారిలో లక్నోకు చెందిన సైంటిస్టు రీతూ కరిధాల్ శ్రీవాత్సవ కూడా ఉన్నారు. ఆమె చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు సారధ్యం వహించారు. ఈ విధంగా ఓ మహిళా సైంటిస్టు తాను సైతం ఇస్రో ఖ్యాతికి తోడ్పాటు అందించారు. సైంటిస్టు రీతూ రాకెట్ ప్రయోగాలలో దిట్ట కావడంతో అంతా ఆమెను రాకెట్ రీతూ అని పిలుస్తారు. ఆమె పూర్వీకులది ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్నోనే అయినప్పటికీ ఆమె కుటుంబం ఇప్పుడు అక్కడ లేదు. ఇస్రోలో ఉద్యోగరీత్యా ఆమె కుటుంబం బెంగళూరులోనే ఉంటోంది. త్వరలోనే ఆరంభం అయ్యే మంగళయాన్ యాత్రలో కూడా ఆమె పాలపంచుకొంటుంది. తమ ప్రాంతం మహిళ ఇస్రో ప్రాజెక్టులో అంతర్భాగం కావడంతో లక్నోవాలాలు ఖుషీ చేసుకున్నారు. రీతూ లక్నోవర్శిటీ నుంచి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్సెస్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. తరువాత ఇస్రోలో చేరిన ఆమె ఏరోస్పేస్‌లో నిపుణులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News