మనతెలంగాణ, హైదరాబాద్: రియల్టర్ హత్యకు ప్లాన్ వేసిన నలుగురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కంట్రీమేడ్ పిస్తోల్, రెండు వేట కొడవళ్లు, లక్ష రూపాయల నగదు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన దాసరి భూమయ్య(రిటైర్డ్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్),మామిడి చంద్రయ్య, గొర్రె రాయగొళ్ల అలియాస్ శంకర్, గడ్డం కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాసరి భూమయ్య పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సిఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు, 2018లో ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో ఎసిబి అధికారులు భూమయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎసిబి అధికారులకు తనపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎక్కాటి విజయ్‌పాల్ రెడ్డి సమాచారం ఇచ్చాడని అనుమానిస్తున్నాడు.
దీంతో విజయ్‌పాల్ రెడ్డిపై కక్ష పెంచుకున్న భూమయ్య అతడిని హత్య చేయించాలని ప్లాన్ వేశాడు. దీనికి తన స్నేహితుడు మామిడి చంద్రయ్య సాయం కోరాడు. మార్చి,2023న చంద్రయ్యను కరీంనగర్‌లోని తన ఇంటికి పిలిపించుకుని విజయ్‌పాల్‌రెడ్డిని ఎలా హత్య చేయాలో చెప్పాడు. హత్య చేసేందుకు కిరాయి హంతకుల సాయం తీసుకోవాలని చెప్పాడు. హత్య కోసం రూ.40 నుంచి రూ.50లక్షలు ఇస్తానని చెప్పాడు. చంద్రయ్య గతంలో జనశక్తి ప్రతిఘటన నక్సల్ గ్రూప్‌లో పనిచేయడంతో పలువురితో పరిచయాలు ఉన్నాయి. చంద్రయ్యకు శంకర్ అనే వ్యక్తి మంచిర్యాలకు చెందిన గడ్డం కుమార్‌ను పరిచయం చేశాడు. శంకర్, గడ్డం కుమార్‌తో కలిసి రౌడీషీటర్ అశోక్‌ను పదేళ్ల క్రితం హత్య చేశారు. శంకర్,కుమార్, చంద్రయ్య కలిసి రియల్టర్ విజయ్‌పాల్ రెడ్డిని హత్య చేసేందేందుకు భూమయ్యతో రూ.20లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
దీంతో వారికి భూమయ్య అడ్వాన్సుగా రూ.5లక్షలు ఇచ్చాడు. వెంటనే యాక్షన్‌లోకి దిగిన నిందితులు రియల్టర్ నివాసం ఉంటున్న ఎల్‌బి నగర్‌లోని అష్టలక్ష్మి టెంపుల్ సమీపంలో రెక్కీ నిర్వహించి విజయ్‌పాల్‌రెడ్డి ఫొటో భూమయ్యకు పంపించారు. విజయ్‌పాల్‌రెడ్డిని హత్య చేసేందుకు చంద్రయ్య సికింద్రాబాద్‌లోని హోటల్‌లో బస చేశాడు. హత్య ప్లాన్ తెలుసుకున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సైలు అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, అనంత చారి, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.