లెబనాన్‌లో ఏకకాలంలో పేజర్లు పేలి 12 మంది మృతి చెందగా, వేల సంఖ్యలో తీవ్రగాయాలుపాలైన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయిల్ దేశ నిఘా సంస్థ ‘మొస్సాద్’ హస్తం ఉందని లెబనాన్ ఆరోపిస్తోంది. పేజర్లు పేలిన ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే వాకీటాకీలు సైతం ఏకకాలంలో పేలి ఆ దేశాన్ని మరింత దెబ్బతీశాయి. ముఖ్యంగా ఆ దేశంలో పనిచేస్తున్న ‘హెజ్బొల్లా’ గ్రూపు ఈ వరుస దాడులతో ఖంగుతిన్నది. ఈ తరహాలో శత్రువులను దెబ్బతీయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. హమాస్ తరహాలోనే లెబనాన్‌లో కూడా సాయుధ ఇస్లామిక్ గ్రూపు ‘హెజ్బొల్లా’ పనిచేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన ఇజ్రాయిల్ నిఘా విభాగం ‘మొస్సాద్’, హెజ్బొల్లా కార్యకలాపాలను పసిగడుతూ కౌంటర్ ఆపరేషన్లు చేపడుతూ వచ్చింది. పెగాసస్ వంటి అత్యంత శక్తివంతమైన నిఘా సాఫ్ట్ వేర్ రూపకర్తలైన ఇజ్రాయిలీ దేశస్థులు సెల్‌ఫోన్లు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించడం తమ కదలికలను పసిగడుతున్నారని ‘హెజ్బొల్లా’ భావించింది. అందుకే కాలం చెల్లిన కమ్యూనికేషన్ వ్యవస్థ ‘పేజర్’ సేవలను మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చింది. సెల్‌ఫోన్లు రాకముందు పేజర్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు. వాటిని ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా వినియోగించడం లేదు.
కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చే సందేశం పేజర్లకు చేరుతుంది. తద్వారా మొస్సాద్ కళ్లుగప్పి తమ కార్యాకలాపాలను కొనసాగించవచ్చని హెజ్బొల్లా భావించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మొస్సాద్, వారికి సరఫరా చేసే పేజర్లను మధ్యలోనే తమ చేతుల్లోకి తీసుకుని, ప్రతి పేజర్‌లో అత్యాధునిక పేలుడు పదార్థం PETN (Pentaerythritol tetranitrate)ను అమర్చింది. ప్రతి పేజర్లో బ్యాటరీకి ఆనుకుని అమర్చిన 3 గ్రాముల PETN ఇంతటి విధ్వంసాన్ని సృష్టించింది.
లెబనాన్‌ను వణికించిన ఇటీవలి పేజర్ పేలుళ్లలో రిన్సన్ జోస్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, దశాబ్దం క్రితం వాయనాడ్‌ను విడిచిపెట్టి నార్వేకు వెళ్లిన 37 ఏళ్ల రిన్సన్ జోస్‌పై కేరళలోని వాయనాడ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.