Sunday, January 19, 2025

హర్యానా ఫలితాలను ఆమోదించం

- Advertisement -
- Advertisement -

అనూహ్యం..దిగ్భ్రాంతికరం
ప్రజల మనోభావాలకు పూర్తి విరుద్ధం
కాంగ్రెస్ రియాక్షన్

న్యూఢిల్లీ: హర్యానా ఎన్నికల ఫలితాలు అనూహ్యం, దిగ్భ్రాంతికరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ ఫలితాలను తాము ఆమోదించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రేమేష్ స్పష్టం చేశారు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించిన ఆయన ప్రజాస్వామిక వ్యవస్థకు చెందిన సాధనాల సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలను ఈ ఫలితాలు లేవనెత్తుతున్నాయని చెప్పారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి గంటలలో మంచి ఆధిక్యతను కనబరిచిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వెనుకబడి పోగా బిజెపి ముందుకు దూసుకువెళ్లి మూడవసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగాధిపతి పవన్ ఖేరాతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన జైరాం రమేష్ హర్యానా ఎన్నికల ఫలితాలు ఎన్నికల మోసాల విజయంగా అభివర్ణించారు.

ప్రజల మనోభీష్టానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పారదర్శక, ప్రజాస్వామిక ప్రక్రియ పరాజయంగా ఫలితాలను ఆయన పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, దాదాపు 14 నియోజకవర్గాలలో ఇవిఎంల పనితీరుపై తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయని, త్వరలోనే ఈ అంశాలను ఎన్నికల కమిషన్ వద్దకు తీసుకెళతామని రమేష్ చెప్పారు. హర్యానాలో ఫలితాలు పూర్తిగా ఊహించనివి, ఆశ్చర్యకరమైనవి. వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఇవి ఉన్నాయి. మార్పును కోరుతున్న ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో హర్యానాలో ఫలితాలను మేము ఆమోదించబోము. మా అభ్యర్థులు లేవనెత్తిన అనేక అనుమానాలను ఇసి వద్ద ప్రస్తావిస్తాము అని రమేష్ చెప్పారు. హర్యానాలో మానుంచి విజయాన్ని లాక్కున్నారు. మార్పును కోరుకుంటున్న ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితిని కల్పించారు.

అయితే ఈ అధ్యాయం ఇంకా ముగిసిపోలేదు అని ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీరు ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఏదోవిధంగా మెజారిటీని సాధించేందుకు బిజెపి చేసిన మోసపూరిత కుట్రలను ప్రజలు ఓడించారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రతిపత్తిని హరించి జమ్మూ కశ్మీరు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారికి ప్రజలు గట్టిగా జవాబిచ్చారని రమేష్ తెలిపారు. జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి కొత్తగా ఏర్పడే ఎన్‌సి-కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆయన చెప్పారు. కాగా..అంతకుముందు హర్యానా ఎన్నికల ఫలితాలను ఇసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జైరాం రమేష్ రాసిన లేఖను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల ఫలితాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఇసి స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News