Monday, December 23, 2024

మోడీ మిడతల దాడికి భయపడం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడి కుట్ర
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బిజెపి
ఢిల్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే తాట తీస్తాం
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరిక

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశానుసారమే ఈడి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీచేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ పై నకిలీ, బోగస్, చట్టంలో నిలకడలేని కేసులు పెట్టి ఢిల్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే తాట తీస్తామని అయన హెచ్చరించారు. ప్రధాని మోడీ మిడతల దాడికి బయపడేదిలేదని, నిజాయతీకి మారుపేరైన అరవింద్ కేజ్రీవాల్ కు దేశ ప్రజలు, ఆప్ శ్రేణులు అండగా ఉంటారని ఆయన అన్నారు.

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు జారీ చేసిన ఈడి సమన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్, ట్యాంక్ బండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆప్ శ్రేణులు ప్లకార్డులు చేతబూని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసారు. ఈ ప్రదర్శనకు డాక్టర్ దిడ్డి సుధాకర్ నేతృత్వం వహించి మాట్లాడుతూ ఢిల్లీ పాలనా విధానం చూసి మోడీ భయం, ద్వేషం పెంచుకొని అరవింద్ కేజ్రీవాల్ పై ఈడి దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఏ సంబంధంలేని అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షిగా పిలిపించారా లేదా అనుమానితుడిగా పిలిపించారా అనే విషయంపై స్పష్టత లేదని, కేసుకు సంబంధించిన వివరాలను అందించడంలో ఈడి ఫుర్తిగా విఫలమైందని అయన తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం వెనుక ‘రాజకీయ కుట్ర’ ఉందని, ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం నిరంకుశ మోడీ ప్రభుత్వం చేస్తుందని ఆయన మండిపడ్డారు. చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైన సమన్లను ఈడి తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతామని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ముహమ్మద్ మజీద్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, మహిళా నేతలు మౌనిక, మంజుల, అధికార ప్రతినిధి విజయ్ పవర్, నేతలు టి.రాకేశ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News