ఈడీ చర్యలపై కాంగ్రెస్ నేత స్పందన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించి తనతోపాటు ఇతర విపక్ష పార్టీల గొంతుకలను నొక్కాలని మోడీ ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీలు చర్చించేందుకు సమావేశమవుతోన్న సందర్భంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. “ నేషనల్ హెరాల్డ్ విషయానికొస్తే అది పూర్తిగా బెదిరింపు చర్యే. మాపై చిన్న ఒత్తిడి తెస్తే మేము మౌనంగా ఉంటామని నరేంద్ర మోడీ, అమిత్‌షా భావిస్తున్నారు. కానీ వారికి భయపడే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోడీ, అమిత్‌షాలు ఏం చేసినా మా నిర్ణయం మీద మేం నిలబడతాం. దేశంలో ప్రశాంత వాతావరణం కల్పించడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నా బాధ్యతను కొనసాగినస్తూనే ఉంటా ” అని రాహుల్ పేర్కొన్నారు.