ప్రైవేటీకరించే బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతాం n కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా n మౌలిక ప్రాజెక్టులకు పెట్టుబడులు పెంచే డిఎఫ్ఐ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : ప్రైవేటీకరించే అవకాశమున్న బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడంపై బ్యాంక్ యూనియన్లు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. ‘ప్రభుత్వ సంస్థలను మూసివేయం, ఉద్యోగులను తొలగించం. ఉద్యోగుల పెన్షన్ లేదా వేతనాల పట్ల జాగ్రత్త వహిస్తాం’ అని మంగళవారం కేబినెట్ సమావేశం తర్వాత సీతారామన్ అన్నారు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించబోమని అన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు సెక్టార్లను గుర్తించామని, దీనిలో ఆర్థిక రంగం కూడా ఉందని, అయితే అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించే ఆలోచన లేదని అన్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం నుంచి చేపట్టిన ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మెలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొనగా, బ్యాంకు సేవలపై ప్రభావం పడింది.
ఆర్థిక వ్యవస్థలో కొద్ది బ్యాంకులు కావాలని, అయితే వాటి సామర్థం పెంచనున్నామని అన్నారు. గతేడాదిలో నాలుగు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 10 బ్యాంకులను విలీనం చేసింది. దేశీయ అవసరాలను నెరవేర్చేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) వంటి కొన్ని పెద్ద బ్యాంకులు కావాల్సి ఉందని గతంలో సీతారామన్ అన్నారు.
డిఎఫ్ఐ బిల్లుకు కేబినెట్ ఆమోదం
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం నిధులను సమీకరించేందుకు గాను డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (డిఎఫ్ఐ) ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దీనికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో రోడ్లు, ఓడరేవులు, విద్యుత్ ప్రాజెక్టులపై ప్రభుత్వం పెట్టుబడులను పెంచనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదన ప్రకటన చేశారు. ఇప్పుడు కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. దీనికి ప్రకారం, ఇనిస్టిట్యూషన్కు రూ.20 వేల కోట్ల మూలధనం అందివ్వనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ఆర్థికమంత్రి మాట్లాడుతూ, బిల్లుకు ఆమోదం లభించిందని, దీంతో దీర్ఘకాలిక నిధులను పెంచేందుకు దోహదం చేస్తుందని అన్నారు. ప్రతిపాదిత డిఎఫ్ఐలో 50 శాతం అధికార యేతర డైరెక్టర్లు ఉంటారని ఆమె తెలిపారు.
మౌలిక సదుపాయాలకు నిధుల కోసం డిఎఫ్ఐ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపి) కింద 7000 ప్రాజెక్టులను గుర్తించగా, 202225 కాలంలో ఈ ప్రాజెక్టులకు రూ.111 లక్షల కోట్లు పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా వేసినట్టు బడ్జెట్ సమావేశంలో సీతారామన్ చెప్పారు. డిఎఫ్ఐ 100 శాతం ప్రభుత్వ యాజమాన్యంతో ప్రారంభించి, క్రమంగా ఇది 26 శాతానికి తగ్గిస్తారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో డిఎఫ్ఐ రూ.3 లక్షల కోట్ల వరకు నిధులను సమీకరించనుందని కేబినెట్ సమావేశం అనంతరం సీతారామన్ తెలిపారు. కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడుల కోసం గ్లోబల్ పెన్షన్, బీమా రంగాల నుంచి డిఎఫ్ఐ నిధులను సేకరిస్తుందని, దీనికి పన్ను ప్రయోజనాలు ఉంటాయని ఆమె వివరించారు.