Monday, January 20, 2025

ప్రతిపక్షాల కూటమి కాదది…ఫోటో సెషన్

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని బిజెపి జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన నవ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల కూటమిని ఆయన దుయ్యబట్టారు.

బిహార్‌లో లాలు కుటుంబ పాలన, యూపిలో ములాయం సింగ్ కుటుంబ పాలన, కేంద్రంలో సోనియా గాంధీ కుటుంబ పాలన, తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన కావాలంటే ఈ పార్టీలకు ఓటు వేయాలని, అభివృద్ధి కావాలంటే బిజెపికి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో ప్రధానులు విదేశీ పర్యటనకు వెళ్తే నిత్యం టెర్రరిజం, కశ్మీర్, పాకిస్థాన్ సమస్యలు మాత్రమే ముందుకు వచ్చేవన్నారు. నేడు బిజెపి హయాంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్తే అభివృద్ధే మంత్రంగా చర్చలు జరుగుతున్నాయన్నారు.

కరోనా కష్టకాలం, యుక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా భాతర దేశంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ముందుకు సాగామన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో భారతదేశం 5వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు పరుస్తున్నామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయిలో ఆధునీకరించడం జరిగిందన్నారు. దేశంలోని 5 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను డబ్లింగ్ చేయడం పూర్తైందన్నారు.

కశ్మీర్‌లోని లద్దాఖ్ నుంచి తెలంగాణ వరకు 2500 కిలో మీటరల జాతీయ రహదారిని విస్తరించడం జరిగిందన్నారు. తెలంగాణలో ఇండస్ట్రీయల్ క్యారిడార్, మెగా టెక్స్‌టైల్ పార్కులు అందించిన ఘనత మోడి సర్కార్‌దేనన్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మూడు లక్షల 48 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తైందన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బిజెపికి ఓటు వేయాలని నడ్డా కోరారు. అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు వెళ్లిన దేశ ప్రధాని నరేంద్ర మోడికి ఆయా దేశాలలో ఘన స్వాగతం పలికారన్నారు.

తెలంగాణలోని బిఆర్‌ఎస్ పార్టీ అంటే భ్రష్టాచార్ భస్మాసుర సమితి అని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి చెందలేదని కెసిఆర్ కుటుంబం అభివృద్ధి చెందిందని ఆయన విమర్శించారు. మోడి హయాంలో పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. పేదలకు రెండు పూటలా తిండి అందించాలన్న లక్షంతో 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామన్నారు. పక్కా ఇళ్లు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా 31 లక్షల మరుగుదొడ్లను తెలంగాణలో నిర్మించడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలు రైతుల కోసం పాటు పడే ప్రభుత్వం మోడి ప్రభుత్వమన్నారు.

9 ఏళ్లలో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత మోడిదన్నారు. ప్రపంచం నేడు మోడీని గ్లోబల్ లీడర్‌గా, హీరోగా భావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు డికె అరుణ, ఆచారి, పి.చంద్రశేఖర్, ఏపి. జిత్తేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బంగారు లక్ష్మణ్, బంగారు శృతి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జి దిలీపా చారిలతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News