Friday, January 24, 2025

బిసి మంత్రుల లెక్కలు కాదు…బిసి జనాభా లెక్కలు కావాలి

- Advertisement -
- Advertisement -

బిసి గణన చేపట్టకపోతే బిజెపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
ఢిల్లీ ధర్నాలో బిసి సంఘాల హెచ్చరిక

Not BC Ministers' counts...BC needs census

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మేమెంత ఉన్నామో లెక్కలు తేల్చాలని అడుగుతుంటే కేంద్ర క్యాబినెట్‌లో 27 మంది బిసిలకు అవకాశం కల్పించామని మంత్రుల లెక్కలు చెబుతున్నారని బిసి సంఘాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. బిసి మంత్రుల లెక్కలు కాదు బిసి జనాభా లెక్కలు కావాలని డిమాండ్ చేశాయి. బిసి గణన చేపట్టకపోతే బిజెపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి. బిసిలకు న్యాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదని స్పష్టం చేశాయి. బిసిలకు కావాల్సింది బిసి గణన మాత్రమేనని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది బీసీలు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ యాదవ్, తెలంగాణ యువజన అధ్యక్షులు కనకల శ్యాం అధ్యక్షత వహించారు. జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్‌రావు, ఓబిసి పార్లమెంటు ఫోరం మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు, వైసిపి పార్లమెంటు సభ్యులు బీద మస్తాన్‌రావు, బారగాని భరత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ నాగపూర్ నిర్ణయాలతో ప్రధాని నరేంద్ర మోడి ముందుకు పోలేక పోతున్నారని అన్నారు.

ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. బిసిలు పార్టీలకు అతీతంగా దేశవ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తేనే కేంద్రానికి సెగ తగులుతుందని అన్నారు. బీద మస్తాన్ రావు, మారగాని భరత్‌లు మాట్లాడుతూ బిసి డిమాండ్లపై తాము ఎన్నోసార్లు పార్లమెంటులో మాట్లాడుతున్నా కేంద్రం నుండి కనీస స్పందన లేదని అన్నారు. బిసి గణన విషయంలో కేంద్రంపై గట్టిగా కొట్లాడుతామని అన్నారు. శంకర్‌రావు, క్రాంతికుమార్ యాదవ్‌లు మాట్లాడుతూ కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, కేంద్ర బడ్జెట్‌లో లక్ష కోట్లు కేటాయింపు, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు సాధించే వరకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ధర్నా అనంతరం వందలాది మంది బీసీలు పార్లమెంటు ముట్టడికి ర్యాలీగా బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బిసి నేతలు రవి కృష్ణ గౌడ్, కె. శ్రీనివాస్, టి. విక్రమ్ గౌడ్, నాగ మల్లేశ్వరరావు, పి. మణిమంజరి, పి.బడేసాబ్, జాజుల లింగగౌడ్, మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News